కరోనాపై ఆందోళన వద్దు

5 Jul, 2020 04:25 IST|Sakshi

మీడియాతో వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాసరావు

రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా రిస్క్‌ రేట్‌ తగ్గుతోంది

జాగ్రత్తలు పాటిస్తే బాధితులు వేగంగా కోలుకుంటారు

ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా హోం ఐసోలేషన్‌

గాంధీలో క్రిటికల్‌ కేసుల బాధితులకే చికిత్స

తక్కువ లక్షణాలు ఉన్న వారికి ఇతర ఆస్పత్రుల్లో వైద్యం

సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన 50 వేల పరీక్షలు పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బారినపడితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య సంచాలకులు జి. శ్రీనివాసరావు సూచించారు. జాగ్రత్తలు పాటిస్తే వేగంగా కోలుకుంటారని వివరించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ రిస్క్‌ రేట్‌ తగ్గుతోందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లా డారు. దేశంలో ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే హోం ఐసోలేషన్‌ సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని, అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రజలు పనుల నిమిత్తం రోడ్లపైకి రావడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగిందన్నారు. జూన్‌లో అత్యధికంగా 13 వేల కేసులు నమోదైనట్లు శ్రీనివాసరావు వివరించారు.

అయితే కేసుల సంఖ్య పెరిగినప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ అందరికీ సేవలందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. గాంధీ ఆస్పత్రి ని అత్యవసర కేటగిరీ కింద నిర్దేశించామని, క్రిటికల్‌ కేసులను (బాధితులను) మాత్రమే అడ్మిట్‌ చేసుకొని చికిత్స చేస్తున్నామన్నారు. లక్షణాలు తక్కువ ఉన్న వారికి ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వైరస్‌ సోకిన వారిలో ఎక్కువ శాతం మందికి లక్షణాలే లేవని, కొందరికి తెలియకుండానే వైరస్‌ వచ్చి పోతోందన్నా రు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు వైరస్‌తో ప్రజలంతా కలసి జీవించక తప్పదన్నారు. వైరస్‌ను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ కరోనా యోధులుగా పనిచేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న ఆయన... కరోనాపై ప్రజలను చైతన్యపరిచే బాధ్యత మీడియాపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కరోనా లెక్కల్ని దాచలేదని, పూర్తిస్థాయిలో పారదర్శకంగా వివరాలను ప్రజలకు చెబుతున్నామన్నారు.

ల్యాబ్‌లవారీగా పరీక్షలు, ఫలితాలు... 
ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల విధానం సరైన విధంగా లేదని, అనుమానితుల్లో ఎక్కువ మందికి పాజిటివ్‌గా ఫలితాలు చూపుతున్నాయని డాక్టర్‌ జి. శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకుగల కార ణాలను తెలుసుకొనేందుకు నిపుణుల కమిటీతో మరోసారి తనిఖీలు చేస్తామన్నారు. ఇప్పటికే 12 ల్యాబ్‌లకు నోటీసులు ఇచ్చామని, వారంతా వివరణ కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నారని, కొత్తగా మరో 5 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చిందన్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలపై మరింత స్పష్టంగా బులెటిన్‌ ఇస్తామని, ల్యాబ్‌లవారీగా పరీక్షలు, పాజిటివ్‌ కేసుల వివరాలను అందులో చేరుస్తామన్నారు. రాష్ట్రంలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పక్కాగా జరుగుతోందని, సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన 50 వేల పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభు త్వ ల్యాబ్‌లలో పరీక్షల సామర్థ్యం 6,500కు పెరిగిందని, త్వరలో మరింత పెంచుతామన్నారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే 104 కు కాల్‌ చేయాలని, అత్యవసర సేవల కోసం 108కి ఫోన్‌ చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు