‘మెడికల్‌’ రెండో విడత మరింత ఆలస్యం!

15 Aug, 2018 02:40 IST|Sakshi

కౌన్సెలింగ్‌ విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు సర్కార్‌

ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన వైద్య ఆరోగ్య శాఖ, ఇతర న్యాయాధికారులు

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడత మెడికల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జీవో నంబర్‌ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్‌ కాలేజీలో ఓపెన్‌ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్‌ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్‌ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్‌ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్‌ 550 తీసుకొచ్చింది.

ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత తానిచ్చిన స్టేను సమర్థ్ధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఇదిలా ఉండగా రెండో విడత మెడికల్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేసుకొని సీట్లు పొందిన విద్యార్థులు మెడికల్‌ కాలేజీల్లో తరగతులకు హాజరవుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

జీవో నంబర్‌ 550పై హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నందున కౌన్సెలింగ్‌ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. అయితే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ప్రకారం ఈ నెలాఖరులోగా మెడికల్‌ కౌన్సెలింగ్‌ పూర్తి చేసి అడ్మిషన్ల ప్రక్రియను ముగించాలి. అప్పటిలోగా కౌన్సెలింగ్‌ నిర్వహించలేని పరిస్థితుల్లో ఎంసీఐ అనుమతి ఇవ్వాలి. కానీ అంత సులువుగా ఎంసీఐ అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో ఏం చేయాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. రెండో విడతలో 444 ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌ జరగాల్సి ఉంది.

మరిన్ని వార్తలు