టైమ్‌కు రావాలి.. తెల్లకోటు ధరించాలి

4 Oct, 2017 03:01 IST|Sakshi

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందికి వైద్య శాఖ ఆదేశాలు

సాక్షి,హైదరాబాద్‌: ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సహాయ సిబ్బంది కచ్చితంగా యూనిఫామ్‌ ధరించాల్సిం దేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ సమయాల్లో కచ్చితంగా ఆస్పత్రిలో ఉండాలని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ఆస్పత్రులను సందర్శించిన సందర్భాల్లో.. ఎక్కువ మంది వైద్యులు, పారామెడికల్, సహాయ సిబ్బంది యూనిఫామ్‌ లేకుండా వస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు.

వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, సహాయ సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. సమయానికి వచ్చి చివరి పేషెం టును పరిశీలించే వరకు వెళ్లొద్దని పేర్కొన్నారు. వైద్యులు తెల్లకోటు (ఆప్రాన్‌) ధరించాలని, పారామెడికల్‌ సిబ్బంది వారి యూనిఫాం వేసుకోవాలని స్పష్టం చేశారు. స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు సైతం యూనిఫాం విషయంలో నిబంధన లు పాటించాలని సూచించారు. పారిశుధ్య పనులు నిర్వహించే సిబ్బంది సైతం యూనిఫాం ధరించాలని ఆదేశించారు. ఈ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

మరిన్ని వార్తలు