సిద్దిపేటలో వైద్యారోగ్య శాఖ సర్వే

25 Jul, 2018 10:51 IST|Sakshi
కుటుంబ సభ్యుల వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేస్తున్న ఆశ కార్యకర్త 

ప్రతి కుటుంబ సభ్యుడి వివరాలు సేకరణ

అన్ని వివరాలు ఆన్‌లైన్లో నమోదు

త్వరలో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం

సిద్దిపేటకమాన్‌ : ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణ స్థాయి తెలుసుకునేందుకు సిద్దిపేటలో జిల్లా వైద్యారోగ్య శాఖ సమగ్ర సర్వే చేపట్టింది. ప్రజలు ఏ మేరకు ఆరోగ్యంగా ఉన్నారు? వారికి ఇంకా ఎలాంటి వైద్య సేవలు అసరం? ఉందో గుర్తించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది సిద్దిపేటలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ.. కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలో సుమారు 30 వేల ఇళ్లు.. 1.50 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సర్వే ముందుగా సిద్దిపేటలో నిర్వహించి.. ఆపై జిల్లావ్యాప్తంగా చేపడతామని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

45 అంశాలతో కూడిన సర్వే

ఆరోగ్య సర్వే కోసం 45 అంశాలు పొందుపరిచారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని పేరు, ఇతర సభ్యుల వివరాలు, ఆధార్‌ నంబర్లు, రేషన్‌కార్డు నంబర్, ఫోన్‌ నంబర్లు, విద్యార్హత, వృత్తి, మతం, కులం, ఆర్థిక స్థితి, ఆహారపు అలవాట్లు, పోషకాహర లోపం, పుట్టుక లోపాలు, నోటి, దంత సమస్యలు, సంక్రమణ, అసంక్రమణ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, కంటిచూపు తదితర వివరాలు నమోదు చేస్తున్నారు.

ఆయా వివరాలను ముందుగా రిజిస్టర్‌లో నమోదు చేసి ఆపై ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రజల ఆరోగ్య స్థితిగతులపై జిల్లా వైద్యారోగ్య శాఖకు పూర్తి అవగాహన ఏర్పడనుంది. దీంతో పాటు వివిధ అంశాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు  రూపొందించాలో అవగతమవుతుంది.

తద్వారా ఎంత మందికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, గతంతో పోల్చితే వివిధ విభాగాల్లో పలు రుగ్మతలతో బాధపడే వారి సంఖ్య పెరిగిందా? లేక తగ్గిందా? తదితర వివరాలు వెల్లడికానున్నాయి. అలాగే పౌష్టికాహార లోపం, ప్రజల ఆరోగ్యంపై వారి కుటుంబాల ఆర్థి క స్థితి ఏ మేరకు ప్రభావితం చేయనుంది? అనే విషయాలను విశ్లేషించడంతో పాటు వాటిని అధిగమించేందుకు, వారి ఆరోగ్యం పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అవకాశం ఉంటుంది.

ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నాం..

పట్టణంలోని ప్రతి కుటుంబంలో సభ్యుల వివరాలు సేకరిస్తున్నాం. వారికి సంబంధించిన వ్యాధుల నిర్థారణ తదితర అంశాలను నమోదు చేస్తున్నాం. వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఈ నమోదు ప్రక్రియ ఉపయోగపడుతుంది. ప్రతి కుటుంబం తమ సభ్యుల పూర్తి వివరాలు తెలిపేందుకు సహకరించాలి.   - సంతోషి, ఏఎన్‌ఎం, సిద్దిపేట 
 

మరిన్ని వార్తలు