మందులు ఎగిరొస్తాయి!

6 Mar, 2019 02:16 IST|Sakshi
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏబీసీ వర్క్‌షాప్‌లో పాల్గొన్న వైద్యులు, వలంటీర్లు

డ్రోన్‌ సహాయంతో మెడికల్‌ కిట్లు 

జీవీకే ఈఎమ్మార్‌ఐ వినూత్న ప్రయోగం

రోడ్డు ప్రమాదాల బాధితులకు సత్వర సాయం

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల్లో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సాయం అందించగలిగితే ఎక్కువ మంది ప్రాణాలను కాపాడవచ్చు. గాయపడిన వ్యక్తి శరీరం నుంచి రక్తస్రావం కాకుండా చూస్తే ఆ వ్యక్తికి ప్రాణాపాయం తగ్గించవచ్చు. దీనికోసం జీవీకే ఈఎమ్మార్‌ఐ వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వరమే వైద్య సాయం అందించేందుకు డ్రోన్‌ సాయం తీసుకోనున్నారు. డ్రోన్ల ద్వారా ప్రమాద ప్రాంతానికి మెడికల్‌ కిట్లు పంపించి వైద్య సాయం అందించనున్నారు. దీనికోసం పైలట్‌ ప్రాజెక్టుగా మేడ్చల్‌ కారిడార్‌ను ఎంపిక చేశారు. ఇది సత్ఫలితమిస్తే తెలంగాణలో మరింత విస్తరించే అవకాశం ఉంది! 

తొలుత మేడ్చల్‌ కారిడార్‌లో..  
మేడ్చల్‌ కారిడార్‌లో ప్రమాదాల శాతం అధికంగా ఉండటంతోపాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. గతేడాది మార్చి 3న యాక్టివ్‌ బ్లీడింగ్‌ కంట్రోల్‌(ఏబీసీ) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన జీవీకే సంస్థ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకుంటోంది. దీనిలో భాగంగా రెండో ఫేజ్‌ సేవలను బుధవారం మేడ్చల్‌ పరిధిలోని దేవర యాంజాల్‌లో ప్రారంభించనున్నట్లు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ వినయ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్, ఆదిలాబాద్‌ డీటీసీ శ్రీనివాస్, డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ గీతాంజలి తెలిపారు.  

ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టు.. 
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడేందుకు తొలిగా 108కి సమాచారం ఇస్తారు. అక్కడికి దగ్గరలోఉన్న వలంటీర్లు వెంటనే అక్కడకు చేరుకుని బాధితుడికి వైద్యసేవలు అందిస్తారు. గాయపడిన వ్యక్తి శరీరం నుంచి రక్తస్రావం కాకుండా చూస్తారు. క్షతగాత్రుడికి సకాలంలో అవసరమైన మందులను డ్రోన్‌ ద్వారా పంపుతారు. డ్రోన్‌ ద్వారా పంపేందుకు సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ అనుమతి కోరారు. అనుమతి వచ్చిన వెంటనే డ్రోన్‌ ద్వారా ప్రమాద బాధితుడి వద్దకే అవసరమైన మందులు చేరనున్నాయి. ఇప్పటికే ఆయా వలంటీర్ల ద్వారా ప్రమాదాల్లో గాయపడిన 24 మంది ప్రాణాలను కాపాడగలిగారు. వారందరితో సమావేశమై మూడో ఫేజ్‌ కార్యాచరణను నిర్ణయించనున్నట్లు సంస్థ ప్రతినిధి దేవేందర్‌ కరాబు చెప్పారు.

యాక్టివ్‌ బ్లీడింగ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం
యాక్టివ్‌ బ్లీడింగ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం ద్వారా ఇప్పటివరకు మేడ్చల్‌ జిల్లా సుచిత్ర–కల్లకల్‌–అల్వాల్‌–తుర్కయాంజాల్‌ కారిడార్లలో వలంటీర్లు, సిబ్బంది ద్వారా క్షతగాత్రులకు సేవలు అందిస్తున్నారు. ఈ సేవల్లో పోలీసులు, ఆటోడ్రైవర్లు, విద్యార్థులు, వైద్యులు, ఆర్టీసీ, టోల్‌ప్లాజా సిబ్బంది పాలుపంచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు