ఉద్యోగుల విభజన తర్వాతే వైద్య పోస్టుల భర్తీ!

6 Jan, 2016 02:33 IST|Sakshi

 వైద్య, పారామెడికల్ అభ్యర్థుల ఆశలపై సర్కారు నీళ్లు
 అన్ని ఆసుపత్రుల్లో కలిపి 3 వేలకు పైగా ఖాళీలు
 కనీసం కొత్త పోస్టుల మంజూరుపైనా స్పందించని సర్కారు
 మరింత ఆలస్యం కానున్న నియామకాల ప్రక్రియ
 2 వేల మంది ‘కాంట్రాక్టు’ ఉద్యోగుల జాబితా తయారు

 
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వైద్య, పారామెడికల్ అభ్యర్థుల ఆశలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నీళ్లు చల్లింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ ముగిశాకే.. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే కొత్తగా మంజూరైన పోస్టులను మాత్రం భర్తీ చేస్తామని సంకేతాలు ఇస్తోంది. ఈ నిర్ణయం వైద్య, పారామెడికల్ అభ్యర్థులకు శరాఘాతంగా మారింది.
 
తుస్సుమన్న హడావుడి..
ఇటీవల వైద్య పోస్టులను భర్తీ చేస్తామని, ఖాళీల వివరాలను ఆగమేఘాల మీద అందజేయాలని అధికారులను ఆదేశించి సర్కారు హడావుడి చేసింది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు ఖాళీల వివరాలను సేకరించి సర్కారుకు అందజేశారు. మొత్తంగా మూడు వేలకుపైగా వైద్య, పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. దీనికి సంబంధించి 300 వైద్యుల పోస్టులతో పాటు నర్సింగ్, ఇతర పారామెడికల్ పోస్టులతో జాబితా కూడా రూపొందించారు. కానీ వాటిని ఇప్పుడే భర్తీ చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది.

భారీ లక్ష్యం.. చర్యలు శూన్యం
వైద్య ఆరోగ్యశాఖను, ఆస్పత్రులను బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసింది. కానీ కీలకమైన సిబ్బంది నియామకాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. ప్రతి జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని, 20 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ప్రతి నియోజకవర్గంలో వంద గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఏరియా ఆసుపత్రి ఉండాలని గతంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా, ఏరియా ఆసుపత్రులను 100 పడకలుగా, జిల్లా ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చుతామనీ చెప్పారు.
 
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే కనీసం 10 వేలకు పైగా వైద్య, పారామెడికల్ సిబ్బంది అవసరమని ఆ శాఖే అంచనా వేసింది. కానీ ఖాళీగా ఉన్న 3 వేల పోస్టుల భర్తీపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కొత్తగా మంజూరైన కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ, వరంగల్ ఎంజీఎంల్లోనే భర్తీకి చర్యలు చేపట్టింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక ఖాళీ పోస్టుల భర్తీ మొదలుపెడతామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి చెప్పారు.
 
రెండు వేల కాంట్రాక్టు పోస్టులు
వైద్య ఆరోగ్యశాఖలో రెండు వేల కాంట్రాక్టు పోస్టులున్నట్లు అధికారులు గుర్తించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడిన తర్వాత రెండు వేల మందిలో ఎందరు అర్హులుగా తేలతారనేదానిపై చర్చ జరుగుతోంది. అనుభవం, రిజర్వేషన్ సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే క్రమబద్ధీకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు