అత్యంత అప్రమత్తత అవసరం!

29 May, 2020 00:59 IST|Sakshi

స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటించాలి

మాకేం కాదనే భావనను వీడాలి..

మళ్లీ కేసులు పెరిగితే కఠినమైన లాక్‌డౌన్‌

వర్షాకాలం, చలి కాలాల్లో కేసులు పెరిగే అవకాశాలు

ప్రస్తుత పరిస్థితులపై పలువురు వైద్య నిపుణుల అభిప్రాయాలు

సాక్షి,హైదరాబాద్‌: ‘కరోనా మహమ్మారి ఉధృతి తీవ్రమై పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు క్రమశిక్షణతో మెలగాల్సిన కీలక సమయం ఆసన్నమైంది. పరిమితంగా కొన్ని అంశాలపై మినహాయించి ఇప్పటి వరకున్న లాక్‌డౌన్‌ను దాదాపు ఎత్తివేస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగడంతో పాటు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం వివిధ రంగాల్లో కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మినహాయింపులు, సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కరోనా ప్రభావం తగ్గిపోయింది. ఇక తమకు ఏమీ కాదన్న భావనతో అతి విశ్వాసంతో వ్యవహరిస్తే మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తొచ్చనే హెచ్చరికలు వైద్య పరిశోధకులు, వైద్య నిపుణుల నుంచి వస్తున్నాయి.

ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో కరోనా కేసులు ఇంకా గణనీయంగా పెరిగిన పక్షంలో మరింత కఠినమైన నిబంధనలతో మరోసారి లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎండాకాలం కారణంగా వైరస్‌ వ్యాప్తి తగ్గొచ్చన్న అంచనాలు తలకిందులు కావడంతో, మరో వారం, పది రోజుల్లోనే వర్షాకాలం మొదలు కావడం, ఆ వెంటనే చలికాలం రానుండటంతో కరోనాతో పాటు డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ సీజనల్‌ వ్యాధులు కూడా విజృంభించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఎదురుకానున్న పరిణామాలు, ఏయే అంశాలపై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సాక్షి ఇంటర్వూ్యలో వివిధరంగాలకు చెందిన వైద్య ప్రముఖులు డా.డి.శేషగిరిరావు, డా. విశ్వనాథ్‌ గెల్లా (పల్మనాలజీ అండ్‌ స్లీపింగ్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్ట్‌), డా.కిరణ్‌ మాదల (క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాల) వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే...

రిలాక్స్‌ కావడం మంచిదికాదు
సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌ కొనసాగింపు వల్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారు. మరోవైపు దాన్ని ఎత్తేయడం వల్ల కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినా సమస్యే. అందువల్ల ఈ రెండింటిని బ్యాలెన్స్‌ చేయాల్సి ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక కేసులు పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు కఠినమైన స్వయం నియంత్రణను పాటించాల్సిందే. వ్యక్తిగతంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్‌ వచ్చేందుకు కనీసం ఏడాది పట్టొచ్చు. మారుతున్న వాతావరణాన్ని బట్టి వైరస్‌ వైఖరిని, స్వభావాన్ని మార్చుకుంటోంది. దీన్ని నిర్మూలించే కొంతమేరకే విజయవంతమయ్యే అవకాశాలుంటాయి.

ఇక్కడి వారిలో జన్యుపరమైన అంశాలు, మలేరియా, ఇతర వ్యాధుల టీకాలు తీసుకోవడం వంటి వాటి వల్ల పశ్చిమదేశాలతో పోల్చితే వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉండటం సానుకూల పరిణామం. మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంది. అయితే మాకేమీ కాద ని, లాక్‌డౌన్‌ ఎత్తేశారని రిలాక్స్‌ అవడం మం చిది కాదు. భౌతిక దూరం పాటించడం, చేతు లు కడుక్కోవడం, శానిటైజర్‌ వాడటం, ఇతర పరిశుభ్రతా చర్యలు కచ్చితంగా పాటించాలి. హృద్రోగాలు, న్యూమోనియా, గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు, విరేచనాలు వంటి సమస్యలున్న వారికి కరోనా వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండటం అవసరం.
– డాక్టర్‌ డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్‌

ప్రజలు బాధ్యతతో మెలగాలి
లాక్‌డౌన్‌ దాదాపు ఎత్తేసిన నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కమ్యూనిటీ స్ప్రెడ్‌ మరింత వేగంగా విస్తరించే అవకాశాలుం డటంతో మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేకపోయినా బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దు. సాయంత్రం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లడాన్ని పూర్తిగా తగ్గించాలి. సిగరెట్లు తాగడం, మద్యపానం వంటి అలవాట్లను తగ్గించుకోవడం మంచిది. ఊబకాయం ఉన్నవారితో పాటు అధిక బరువున్న వారు తమ బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నినెలలుగా అసలు బయటికే వెళ్లని 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం మా పరిశోధనలో తేలింది. వారి ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చే వ్యక్తి ద్వారా అతడికి వచ్చింది. దీంతో ఇంట్లో పెద్ద వారుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. – డా.విశ్వనాథ్‌ గెల్లా, పల్మనాలజిస్ట్, స్లీపింగ్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్ట్‌

పెద్దవాళ్లు జాగ్రత్తపడాలి
‘కరోనాకు చికిత్సపై ఇంకా స్పష్టత రాలేదు. కాంబి నేషన్‌ ఆఫ్‌ డ్రగ్స్‌తో, మరోవైపు వ్యాక్సిన్‌తో తగ్గించే దిశలో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు, పరిశోధనలు, అధ్యయనాలు వివిధ దశల్లో సాగుతున్నాయి. తొందరగా మందులు లేదా వ్యాక్సిన్‌ కనుక్కోవాలనే ప్రయత్నా లు ఊపందుకున్నందున సమీప భవిష్యత్‌లోనే దీనిపై శుభవార్త రావొచ్చు. అయితే సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌ విధింపు వల్ల వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌కు సడలిం పులిచ్చిన నేపథ్యంలో అందరూ బాధ్యతతో మెలగాలి. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 60 ఏళ్లకు పైబడిన వారు.. వివిధ అనారోగ్య సమస్యలున్న వా రు మరో ఏడాది పాటు ఇళ్లకే పరిమితమై, ఆరోగ్య సూత్రాలు పాటించాలి.’
– డా.కిరణ్‌ మాదల, క్రిటికల్‌కేర్‌ విభాగాధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్‌

మరిన్ని వార్తలు