జూడాల సమ్మెతో స్తంభించిన వైద్యసేవలు

20 Jun, 2019 03:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పదవీ విరమణ వయసు 58 నుంచి 65కు పెంచడంపై వెల్లువెత్తిన నిరసన 

సాక్షి,హైదరాబాద్‌: ‘నల్లగొండ జిల్లా రామన్నపేటకు చెందిన మురళీ గతకొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం బుధవారం ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నాడు. తీరా న్యూరో ఓపీలో వైద్యులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక మహబూబ్‌నగర్‌కు చెందిన రాజ్యలక్ష్మి గర్భంతో ఉంది. సాధారణ వైద్య పరీక్షల కోసం ఉదయం ఏడు గంటలకే పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చేరుకుంది. ఓపీలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఎదురు చూడాల్సి వచ్చింది. సుదూర ప్రాంతం నుంచి ఆస్పత్రికి చేరుకున్న ఆమె ఉదయం నుంచి ఏమీ తిన కుండా క్యూలో నిలబడటం వల్ల, నీరసంతో సొమ్మసిల్లిపడిపోయింది. ఇక పటాన్‌చెరుకు చెందిన కవిత సుస్తీ చేసిన తన కుమా రుడిని చికిత్స కోసం నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఓపీ వైద్యులు పట్టించు కోకపోవడంతో ఆమె పక్కనే ఉన్న ప్రైవేటు ఆస్పత్రి వైద్యు డిని ఆశ్రయించాల్సి వచ్చింది’. ఇలా ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న ఆస్పత్రుల్లో జూడాల సమ్మెతో అవుట్‌పేషెంట్‌ సర్వీ సులు స్తంభించి పోయాయి. 

ఓపీ బహిష్కరించి...ఆందోళన 
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ డాక్టర్ల సంఘం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెంపువల్ల తమకు ఉద్యోగాలు దక్కకపోగా, ఇప్పటికే రెసిడెంట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న వైద్యులు పదోన్నతులు పొందే అవకాశాన్ని కోల్పో యే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఈ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ  4 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఉస్మానియా, గాంధీ జనరల్‌ ఆస్పత్రులతో పాటు పేట్లబురుజు, నిలోఫర్‌ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం, కోటి చెవిముక్కుగొంతు ఆస్పత్రి, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రుల్లోని జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఆందోళనలో భాగంగా ఓపీ సేవలను బహిష్కరించి, ఆయా ఆస్పత్రులు పరిపాలన భవనాల ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఓపీ, ఐపీ సేవలు స్తంభించిపోయాయి.  

సగానికిపైగా చికిత్సలు వాయిదా 
అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్‌ చేసుకున్నప్పటికీ...అత్యవసర చికిత్సల్లో సహాయపడే జూడాలు సమ్మెలో ఉండటంతో ఆయా చికిత్సలు వాయిదా వేయాల్సి వచ్చింది. గాంధీ జనరల్‌ ఆస్పత్రి సహా ఉస్మానియా ఆస్పత్రిలోనూ బుధవారం సగానికి పైగా చికిత్సలు వాయిదా పడ్డాయి. ఇన్‌పేషెంట్లుగా అడ్మిటై..బుధవారం ఆయా ఆపరేషన్‌ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు  చికిత్సలు వాయిదా వేసినట్లు చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఉస్మానియాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా అడ్మిటైన రోగులకూ ఇబ్బందులు తప్పలేదు. 

మంత్రి హామీతో సమ్మె విరమణ 
జూనియర్‌ వైద్యుల సమస్యను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సుముఖత వ్యక్తం చేశారు. ఈ నెల 21 తర్వాత సీఎం కేసీఆర్‌తో చర్చలకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సమ్మెను విరమించి, విధుల్లో చేరాలని కోరడంతో మంత్రి హామీ మేరకు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు