ఎంజీఎంలో మెరుగుపడని వైద్య సేవలు

27 Nov, 2019 12:23 IST|Sakshi

ఐదు కీలక విభాగాలకు ఇద్దరే అసిస్టెంట్లు

మంత్రులు సమీక్షించినా  ప్రయోజనం శూన్యం

గాలిలో కలుస్తున్న విలువైన ప్రజల ప్రాణాలు

గుండెనొప్పితో బాధపడుతున్న ఖిలావరంగల్‌ చెందిన ఉప్పలయ్య, సంగెంకు చెందిన సాగర్‌ చికిత్స కోసం 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు స్టంట్‌ అవసరమని గుర్తించారు. గుండె వైద్య నిపుణులు లేకపోవడంతో వారు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక హైదరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. 

సాక్షి, ఎంజీఎం(వరంగల్‌) : ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ‘యమ’జీఎంగా మారుతోంది. ధర్మాస్పత్రిలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందక రోగుల విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిన సూపర్‌స్పెషాలిటీ వైద్యులు కొనసాగారు.. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ కాంట్రాక్టు వైద్యులను సైతం తొలగించారు. నాలుగేళ్లుగా సూపర్‌స్పెషాలిటీ వైద్యుల లేమీతో పలు విభాగాలు మూతపడాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలో రోగులకు అందించే సేవలను మెరుగుపరుస్తున్నామని ఎంజీఎంను సందర్శించిన సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పినా.. నెలలు గడుస్తున్నా ఏ మాత్రం మార్పు రాలేదు. ఒక పక్క వైద్యుల లేమి.. మరో ఔషధాల కొరత.. వెరసి రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. 

విభాగాలకు వైద్యులే లేరు.. 
ఎంజీఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్‌ నుంచే కాకుండా కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి రోగులు మెరుగైన వైద్యం కోసం వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కీలక విభాగాల్లో వైద్యులు లేకపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, నెప్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి విభాగాల్లో ఒక్క వైద్యుడు కూడా లేక ఆయా విభాగాలకు తాళం వేయాల్సిన దుస్థితి నెలకొంది. మెడిసిన్‌ విభాగానికి చెందిన వైద్యులతో నామమాత్రంగా సేవలు అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మెరుగైన వైద్యం అవసరమైతే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

గుండె జబ్జులకు అందని వైద్యం..
పేద ప్రజలకు గుండె నొప్పి వస్తే ప్రాణాలు గాలిలో కలవాల్సిందే. ఎంజీఎం ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగానికి కొన్నేళ్లుగా వైద్యుల నియమాకం లేక పోవడంతో గుండె నొప్పితో వచ్చే రోగులకు పూర్తి స్థాయి వైద్యం అందడంలేదు. కొద్దోగొప్పో ఆర్థికంగా ఉన్న వారు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. 2006 సంవత్సరంలో ఎంజీఎం ఆస్పత్రిని 600 పడకల నుంచి వెయ్యి పడకలకు అప్‌గ్రేడ్‌ చేసి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి సేవలను ప్రారంభిం చారు. ఆ సమయంలో రెండు సంవత్సరాలు కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాల్లో మెరుగైన వైద్యసేవలు అందగా.. అనంతరం ఆ సేవలు రోజురోజుకూ క్షీణిస్తూ పూర్తిస్థాయిలో విభాగాలు మూతపడినా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. 

ఏళ్ల తరబడి అందని కిడ్నీ వైద్యం..
కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే వారికి నెప్రాలజీ, యురాలజీ వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో 40 పడకల డయాలసిస్‌ సెంటర్‌ నిర్వహణకు నెప్రాలజీ వైద్యుడి నియామకం తప్పనిసరి. నెప్రాలజీ, యూరాలజీ వైద్యులు లేకుండానే డయాలసిస్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు గత్యంతరం లేక ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

మంత్రులు సమీక్షించినా.. 
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని వైద్యారోగశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించిన సమయంలో సమస్యలు తెలుసుకుని సమీక్షలు నిర్వహించారు. సేవలను మెరుగుపరుస్తామని హామీ సైతం ఇచ్చారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఒక పక్క వైద్యులు పదవీ విరమణ పొందుతున్నారు. కొత్తవారిని నియమించడంలేదు. ఉన్నవారిపై పని ఒత్తిడి పెరుగుతోంది. పలు సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు మూతపడుతున్నా ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సమీక్షలు,  సందర్శనలనతో సరిపెట్టకుండా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది.

క్షతగాత్రులకు కరువైన భరోసా..
ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి తలకు తీవ్రగాయాలై ప్రాణపాయ స్థితిలో ఎంజీఎంకు చవ్చే క్షతగాత్రుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే రోగులకు అత్యవసరంగా సీటీ, ఎంఆర్‌ఐ వంటి స్కానింగ్‌ నిర్వహించి వారికి ఏ మేర రక్తస్రావం జరిగింది.. ఏ మేరకు రక్తం గడ్డ కట్టిందనే విషయాన్ని న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్‌ డాక్టర్లు తెలుసుకుని వైద్యసేవలు అందించడంతో పాటు అవసరమైన శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విభాగాల్లో ఒకే ఒక్క అసిస్టెంట్‌ వైద్యుడు ఉండడంతో పూర్తిస్థాయిలో సేవలు అందక క్షతగాత్రులకు ప్రాణసంకటంగా మారింది. 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
ఎంజీఎం ఆస్పత్రిలో సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో వైద్య నిపుణులు, వైద్యుల కొతర తదితర అంశాలను రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నాం. భర్తీ ప్రక్రియ త్వరలో జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వివిధ విభాగాల వైద్యులతో సాధ్యమైనంత వరకు పేద రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. 
– శ్రీనివాస్, ఎంజీఎం సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు