దాడులకు నిరసిస్తూ 17న వైద్యసేవలు నిలిపేస్తాం

15 Jun, 2019 01:57 IST|Sakshi

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ 

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వైద్యులపై దాడులకు నిరసనగా శుక్రవారం కోఠిలోని ఐఎంఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వైద్యులకు భద్రత కల్పించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. నేషనల్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 17న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేసి భారత్‌బంద్‌ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

దేశవ్యాప్తంగా వైద్యులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిపివేసి వైద్యుల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. కోల్‌కతాలో వైద్యుడిపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వైద్యులు 99 శాతం సేవాభావంతో పనిచేస్తారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గుర్తించాలన్నారు. అలాగే వైద్యులపై దాడిచేసినవారిపై శిక్షలు కఠినంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ రవిశంకర్, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ సంజీవ్‌సింగ్‌ యాదవ్, డాక్టర్‌ రఘురామ్, డాక్టర్‌ రంగనాథ్, డాక్టర్‌ ప్రభావతి, డాక్టర్‌ దయాళ్‌సింగ్‌తో పాటు పెద్ద ఎత్తున వైద్యులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు