మాస్క్‌ల్లేవ్‌.. మేం రాం!

4 Apr, 2020 08:26 IST|Sakshi

 క్యాజువాలిటీల్లో విధులంటేనే భయపడుతున్న వైద్య సిబ్బంది

ఎన్‌–95 మాస్క్‌లు, పీపీఈలు లేక ఇబ్బందులు

ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్‌ తదితర ప్రధాన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి

సాక్షి, సిటీబ్యూరో: కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో క్యాజువాల్టీల్లో విధులు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది భయపడుతున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతరత్రా కరోనా నిరోధక సామగ్రి ఇక్కడ అందుబాటులో లేకపోవడమే వారి భయానికి కారణం. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్‌ సహా పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు రద్దు చేశారు. దీంతో సాధారణ దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు అత్యవసర రోగులు, క్షతగాత్రులు ఆయా ఆస్పత్రుల్లోని క్యాజువాల్టీలకు చేరుకుంటున్నారు. ఒక్కో ఆస్పత్రి క్యాజువాలిటికి రోజుకు సగటున 250 నుంచి 300 మంది రోగులు వస్తున్నారు. ఇలా ఇక్కడికి వచ్చిన బాధితులను ముందుగా జూనియర్‌ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర పారామెడికల్‌ స్టాఫ్‌  పరీక్షిస్తారు. సమస్య తీవ్రతను బట్టి వారిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసి, ఆయా విభాగాలకు తరలిస్తుంటారు. ప్రస్తుతం క్యాజువాలిటీలకు సాధారణ రోగులతో పాటు కరోనా బాధితులు కూడా వస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. వారు చనిపోయిన తర్వాత కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్థారణ అవుతుండటంతో ఇక్కడ పని చేసేందుకు వైద్యులుభయపడుతున్నారు. 

ఐసోలేషన్‌ వార్డులకే పరిమితం
కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం గాంధీ సహా అన్ని ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్‌ వార్డుల్లో పూర్తిగా పాజిటివ్‌ కేసులే ఉండటం, వారి నుంచి వైద్య సిబ్బందికి కూడా వైరస్‌ విస్తరించే అవకాశం ఉండటంతోప్రభుత్వం ఆయా వార్డుల్లో పని చేస్తున్న వారికి ఎన్‌–95 మాస్క్‌లు, చేతి గ్లౌజులు, పర్సనల్‌ ప్రొటక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్స్‌ అందించింది. క్యాజువాల్టీలో వైద్యసేవలు అందిస్తున్న వారికి అలా ఇవ్వడం లేదు. తమకు వైరస్‌ ఉన్నట్లు రోగులకే కాదు వైద్యులకూ తెలియక పోవడం, తీరా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యేసరికి వైద్య సిబ్బంది సహా బంధువులు, ఇతర రోగులు క్లోజ్‌ కాంటాక్ట్‌లోకి వెళ్తుండటంతో వారి నుంచి వీరికి కూడా వైరస్‌ విస్తరిస్తుంది. నిలోఫర్‌ క్యాజువాలిటీలో శిశువుకు చికిత్స చేసిన వారిలో 25 మంది వైద్య సిబ్బంది ఆ తర్వాత ఐసోలేషన్‌కు వెళ్లగా, తాజాగా ఉస్మానియాలో మహిళకు చికిత్స చేసిన క్యాజువాలిటి వైద్య సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌కు పంపాల్సి వచ్చింది. 

గాంధీ మినహా ఇతర ఆస్పత్రుల్లో కరువే..
గాంధీ కరోనా నోడల్‌ కేంద్రంలోని ఐసీయూ, ఐసోలేషన్‌ వార్డుల్లో పనిచేస్తున్న వారికి మినహా ఇతరులకు మాస్క్‌లు, పర్సనల్‌ ప్రొటక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్స్‌ అందుబాటులో లేవు. ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎవరికి వైరస్‌ ఉందో? ఎవరి నుంచి వైరస్‌ ఎలా విస్తరిస్తుందో తెలియక వైద్య విద్యార్థులు, ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ వద్ద ఏడు వేల పీపీఈ కిట్స్‌ ఉండగా, వీటిలో ఒక్క గాంధీలోనే రోజుకు సగటున 1000 నుంచి 1200 కిట్స్‌ వినియోగమవుతుండటం, రోగుల నిష్పత్తికి తగినన్ని మాస్కులు, పీపీఈ కిట్స్‌ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

మరిన్ని వార్తలు