టెన్త్‌ పరీక్షలు రాసే గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు: కొప్పుల 

30 May, 2020 00:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేనెల 8 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు రాసే గురుకుల విద్యార్థులు జూన్‌ 1వ తేదీ కల్లా రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చేరుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. ఆ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలను పునఃప్రారంభం చేస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం మంత్రి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కరోనా వైరస్‌ పట్ల ఆందోళన చెందకుండా ప్రిన్సిపల్, స్టాఫ్‌ నర్సులు సూచనలు చేయాలన్నారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, భౌతిక దూరం తదితర అంశాలపై అవగాహన పెంచాలన్నారు.

ప్రతి పాఠశాల ప్రాంగణంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ సిస్టం ఏర్పాటు, విద్యార్థులకు ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు అందించాలన్నారు. తరగతి గదిలో, డైనింగ్‌ హాలులో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని, తరగతి గదులను, విద్యార్థులు కూర్చునే బెంచీలను, బల్లాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని, ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాకుండా చదువుపైనే ధ్యాసపెట్టేలా చూడాలన్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ తమ సొసైటీ పరిధిలో 173 పాఠశాలల్లో మొత్తం 12,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు