మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్

28 Sep, 2014 00:12 IST|Sakshi
మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్

తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు
ఐటీఐఆర్ ప్రాజెక్టుతో మరో కోటి జనాభా పెరుగుదల
సినీ పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తామని వెల్లడి

 
హైదరాబాద్: అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా హైదరాబాద్ మహానగరం ‘మెడికల్ టూరిజం హబ్’గా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ‘కాంటినెంటల్ ఇంటర్నేషనల్ కేన్సర్ సెంటర్ ’ను ఆయన ప్రారంభించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యసేవలు, పరికరాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. ఎంత మంచి ఆసుపత్రిని కట్టినా దానిని సరిగ్గా ప్రచారం చేసుకోకపోతే ఉపయోగం ఉండదని.. ఈ ఆసుపత్రికి తాను అంబాసిడర్‌గా, ఏజెంట్‌గా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచేందుకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందన్నారు. రాజధానిలో ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తున్నందున మరో కోటి మంది జనాభా పెరుగుతుందన్నారు. సినీ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తామని, నాలుగైదు వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని గొప్పగా నిర్మిస్తామని చెప్పారు. దాని బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకరిగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు కృష్ణను ఆయన కోరారు. హైదరాబాద్ వాతావరణం మరెక్కడా ఉండదని తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి, రేడియేషన్ అంకాలజిస్ట్  రమణమూర్తి, ప్రముఖ సినీ నటుడు కృష్ణ, విజయనిర్మల దంపతులు పాల్గొన్నారు.

 హైదరాబాద్ నా సొంతూరు: సినీ హీరో కృష్ణ

ముప్పై ఏళ్లుగా తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, ఈ నగరమే తన సొంతూరన్న అభిప్రాయంతో ఉన్నానని ప్రముఖ సినీ నటుడు కృష్ణ చెప్పారు. ఇక్కడ సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే పెద్దదిగా నిర్మించదలచిన ఆ ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ ఫిల్మ్‌సిటీగా పేరుపెట్టాలని సూచించారు.
 
 

మరిన్ని వార్తలు