మందుల్లేవ్‌..వైద్యం ఎలా?

4 Nov, 2019 11:19 IST|Sakshi

మొక్కుబడిగా మారిన ‘ఈఎస్‌ఐ’ డిస్పెన్సరీలు

తీవ్రమైన మందుల కొరత

రోగులు, సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం

పర్చేజ్‌ ఆర్డర్‌పై సంతకం చేసే నాథుడే కరువు

ముషీరాబాద్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు మొక్కబడిగా మారుతున్నాయి. మందుల కొరత, సిబ్బంది లేమి వంటి సమస్యలతో ఇక్కడ రోగులకు సరైన వైద్యం అందడం లేదు. విద్యానగర్‌లోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో రెగ్యులర్‌గా 292 రకాల మందులు సరఫరా జరిగేవి. కానీ నేడు 130 రకాల మందులు మాత్రమే ఉన్నా యి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఈ మందులు కూడా నిండుకునే అవకాశం లేకపోలేదు. చిక్కడపల్లిలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో నాలుగు రోజు ల క్రితం విద్యుత్‌ బిల్లు చెల్లించకపోవడంతో ఆ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఫ్రిజ్‌లో ఉన్న మందులు చెడిపోతాయని వేరే డిస్పెన్సరీకి తరలించారు. ప్రస్తుతం చీకట్లోనే విధులు నిర్వర్తిం చాల్సిన పరిస్థితి. ఇది ఒక్క విద్యానగర్, చిక్కడపల్లి ల్లోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీల పరిస్థితి కాదు.

నగరం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీల పరిస్థితికి అద్దంపడుతుంది. ఈఎస్‌ఐలో ఇటీవల జరిగిన భారీ కుంభకోణం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపివేసింది. డైరెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్, జాయింట్‌ డైరెక్టర్‌లతో పా టు పలువురు ముఖ్యులు జైలుకు వెళ్లారు. దీంతో డిస్పెన్సరీల నిర్వహణ అగమ్యగోచరంగా తయారైంది. దీంతో  తీవ్ర మందుల కొరత నెలకొంది. ఈఎస్‌ఐ డిస్పెన్సరీలలో బీపీ, షుగర్‌లతో పాటు ఐవీ ఫ్లూయిడ్స్, కాల్షియం, మల్టీ విటమన్‌ మాత్రలు, కేన్సర్, డయాలసిస్‌కు వాడే మందులు, ఇమోఫోలియో ఇంజక్షన్‌లు వంటి  అత్యవసర మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. వేల రూపాయలు పెట్టి మందులు బయట కొనలేక పేద కార్మిక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. గత ఆరు నెలలుగా మందుల కొనుగోలుకు డిస్పెన్సరీలలోని డాక్టర్లు ఇండెంట్‌లు పెట్టినా కావాల్సిన మందుల కోసం పర్చేజ్‌ ఆర్డర్‌పై డైరెక్టర్‌ సంతకం లేకపోవడంతో మందుల సరఫరా ఆగిపోయింది. మరో నెలరోజులు ఇదే పరిస్థితి కొనసాగితే డిస్పెన్సరీలలో మందులు పూర్తిగా దొరకని ప్రమాదం పొంచిఉంది. ఒకవేళ పర్చే జ్‌ ఆర్డర్‌పై సంతకం చేసినా ఆ మందులు రావడానికి కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. అప్పటికీ డిస్పెన్సరీల్లో మందుల నిల్వలు ఖాళీ అయ్యే ప్రమాద ం ఉంది. ఇక ఆస్పత్రుల పరిస్థితి చెప్పనవసరంలేదు.

కొత్త డైరెక్టర్‌ బాధ్యతలు తీసుకున్నా...
ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి స్థానంలో కొత్త డైరెక్టర్‌గా అహ్మద్‌ నదీమ్‌కు బాధ్యతలను అప్పగించారు. మొదట పదిరోజులు బాధ్యతలు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. ఉన్నతాధికారుల ఆదేశంతో బాధ్యతలు స్వీకరించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ ఈఎస్‌ఐ డైరెక్టర్‌ కార్యాలయం మొహం చూడనేలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎక్కడి పెండింగ్‌ ఫైళ్లు అక్కడే ఉన్నాయి. మందులు లేకపోవడంతో సిబ్బందికి, రోగులకు ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. రాంచంద్రాపురం, నాచారం, ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. నాచారంలో కొత్త బిల్డింగ్‌ నిర్మాణం పూర్తయినా అందులోకి వెళ్లాలంటే డైరెక్టర్‌ అనుమతి కావాల్సి ఉంది. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి రోగిని తీసుకురావాలన్నా అంబులెన్స్‌లు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. విలువైన యంత్రాలు పాడైపోయినా వాటిని రిపేర్‌ చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. దీంతో కోట్ల రూపాయల యంత్రాలు అలాగే పనిచేయకుండా నిరుపయోగంగా పడి ఉంటున్నాయి.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు9 నెలలుగా రాని జీతాలు...
ఈఎస్‌ఐలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది 1090 మంది ఉండగా వీరికి కొందరికి గత 6 నెలలు, మరికొందరికి అయితే 9 నెలల నుంచి జీతాలు అందడంలేదు. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో 70 డిస్పెన్సర్లు ఉండగా 60 డిస్పెన్సరీలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. వీటికి 7 నెలలుగా అద్దె కట్టకపోవడంతో భవనాల యాజమానులు సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. నిధులున్నప్పటికీ, నిర్ణయం తీసుకునే యంత్రాంగం లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.

మరిన్ని వార్తలు