మీసేవ... మరింత పారదర్శకం

23 Jul, 2015 00:11 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మీసేవ కేంద్రాలకు ధ్రువపత్రాల కోసం వెళితే సరైన స్పందన ఉండడం లేదు... అక్కడ ఉండాల్సిన సిబ్బంది ఉండడం లేదు... ఒక్కో ధ్రువపత్రానికి నిర్దేశించిన దాని కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు... కనీసం ఏ సర్టిఫికెట్లు ఇచ్చామన్న రిజిస్టర్లు కూడా మీ సేవ కేంద్రాలలో ఉండడం లేదు. కొన్నిచోట్ల పనివేళల్లో కూడా మీసేవ కేంద్రాలు తెరచి ఉండడం లేదు...అనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లాలోని కేంద్రాల నిర్వహణ విషయంలో పారదర్శకంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది.
 
  ప్రభుత్వ వ్యవహారాలలో ప్రజలకు కీలకంగా ఉపయోగపడే ధ్రువపత్రాలను జారీ చేసే మీ-సేవకేంద్రాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. మీసేవా కేంద్రాలతో పాటు శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలు ఎలా ఉండాలన్న దానిపై ఆయన ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు. ముఖ్యంగా పింఛన్లు, ఇతర సామాజిక అవసరాల కోసం ఉపయోగపడే ఆధార్ కార్డుల్లో అడ్డగోలుగా వయసును సవరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.
 
 గతంలో మాదిరిగా కాకుండా మీసేవా కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు పాటించి తీరాల్సిందేనని, ప్రతి నెలలో స్థానిక తహసీల్దార్ తన పరిధిలోని కేంద్రాలన్నింటినీ తనిఖీ చేసి నివేదికను పంపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓలు కూడా తమ పరిధిలోకి వచ్చే కేంద్రాలలో నెలలో 10శాతం కేంద్రాలను తనిఖీ చేయాల్సిందేనని, నిబంధనల ప్రకారం లేకపోతే సెంటర్లను మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మీసేవా కేంద్రాలద్వారా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు నేరుగా టోల్‌ఫ్రీనంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
 కలెక్టర్ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు..
 
 మీసేవా కేంద్రాలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గ ంటల వరకు కచ్చితంగా తెరచి ఉంచాలి. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు మాత్రమే భోజన విరామం తీసుకోవాలి. ఆదివారం, ప్రభుత్వ సెలవుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయాలి.
 మీసేవ ద్వారా సేవలు పొందే వ్యక్తి సమర్పించే అనుబంధ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రతి మీసేవా కేంద్రంలో కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. ధరల పట్టికను కేంద్రంలో ప్రదర్శించాలి.
 మీసేవ కోసం వచ్చే వినియోగదారుల నుంచి సిటిజన్ చార్టర్ బోర్డులో నిర్దేశించిన రుసుము మాత్రమే వసూలు చేయాలి. సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి అదనపు రుసుమూ వసూలు చేయరాదు.
 ప్రతి కేంద్రంలో రిజిస్టర్‌తో పాటు ఫిర్యాదు పెట్టె కూడా ఉంచాలి. ఆ పెట్టెను తెరిచే అధికారం తహసీల్దార్లకు మాత్రమే ఉంటుంది.
 
 అనుమతి లభించిన చోట మాత్రమే మీసేవా కేంద్రాన్ని నిర్వహించాలి. ప్రదేశం మార్చి నిర్వహించకూడదు.
 ఆధార్ నమోదును ఉచితంగా చేయాలి. నమోదు/సవరణల కోసం సంబంధిత అధికారి సంతకం, స్టాంప్ ఉంటేనే చేయాలి. సవరణల కోసం కేవలం రూ.15 మాత్రమే వసూలు చేయాలి. సవరణల కోసం జనన ధ్రువపత్రం లేదా 10వ తరగతి సర్టిఫికెట్ లేదా పాస్‌పోర్టు లేదా గెజిటెడ్ అధికారి లెటర్‌హెడ్‌పై జారీ చేసిన జనన ధ్రువపత్రం ఉండాలి.
 
 శాశ్వత ఆధార్ కేంద్రాలు కూడా అనుమతి ఇచ్చిన చోటనే నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదేశం మార్చకూడదు.
 సంచార ఆధార్ నమోదు కేంద్రాలకు సంబంధించి బ్లూమ్‌సొల్యూషన్స్‌కు మాత్రమే అనుమతి ఉంది. సవరణల కోసం శాశ్వత ఆధార్ కేంద్రాలకు వర్తించే నియమాలను పాటించి తీరాలి.
 ప్రతి నెలా మొదటి శనివారంలో స్థానిక తహసీల్దార్ తన పరిధిలోని మీసేవా కేంద్రాలను తనిఖీ చేసి నిబంధన ప్రకారం నడుస్తోందని కేంద్ర తనిఖీ నివేదిక పూర్తి చేసి 10వ తేదీలోగా జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వాలి. ఆర్డీఓలు కూడా తమ పరిధిలోని 10 శాతం కేంద్రాలను నెలలో తనిఖీ చేయాలి.
 నిబంధనలను మొదటిసారి అతిక్రమిస్తే సదరు మీసేవా కేంద్రాన్ని 15 రోజుల పాటు నిలిపివేసి రూ.2వేల జరిమానా విధిస్తారు. రెండోసారి అతిక్రమిస్తే 15 రోజుల పాటు నిలిపివేసి రూ.5వేల జరిమానా విధిస్తారు. మూడోసారి అతిక్రమిస్తే సెంటర్‌ను రద్దు చేసి ఈఎస్‌డీ రూల్స్‌లోని క్లాజ్ 19,20,21 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
 వినియోగదారులకు మీసేవా కేంద్రాల వల్ల కలిగే అసౌకర్యాలను తహసీల్దార్, ఆర్డీఓ లేదా 1800-425-1442 లేదా 1100 అనే టోల్‌ఫ్రీనంబర్లకు ఫోన్ చేసి తెలియజేయవచ్చు.  
 

మరిన్ని వార్తలు