‘మీ–సేవ’లెక్కడ...?

14 Jun, 2019 01:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పౌర సేవలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ–సేవలు రాష్ట్రంలో నిలిచిపోయాయి. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రావడం, దానికి తోడు దరఖాస్తులు పరిశీలించే అధికారులు కొర్రీలు వేస్తుండటంతో మీ సేవా దరఖాస్తులు పరిష్కారం కాకుండా గుట్టలుగా పేరుకుపోయాయి. ఈ సేవల రాకతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలకు బ్రేక్‌ పడినప్పటికీ, తాజాగా యంత్రాంగం పెట్టే మడత పేచీలతో ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీ నుంచి మే 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,94,305 అర్జీలు పెండింగ్‌లు ఉన్నాయి. సేవల జాప్యానికి వరుస ఎన్నికలు, దరఖాస్తుతోపాటు మాన్యువల్‌ కాపీలను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలని ఆంక్షలు విధించడం కూడా ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ రెండింటితో అర్జీల పెండింగ్‌ సంఖ్య పెరిగేందుకు దారితీస్తోంది.
 
ఎన్నికల నిర్వహణతో బిజీ బిజీ 
ఈ ఏడాది జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఆ ప్రభావం మీ సేవలపై దాదాపు ఫిబ్రవరి రెండో వారం వరకు పడింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు, అనంతరం మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలతో ప్రభుత్వ యంత్రాంగం బిజీ అయ్యింది. ఈ తంతు మీ సేవ దరఖాస్తుల పరిష్కారంపై తీవ్ర ప్రభావం చూపాయి. అధికార యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణలో తలమునకలు కావడంతో పరిపాలనా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. దీంతో మీ సేవల ఆర్జీల వైపు కన్నెత్తి చూసే నాథుడే లేకుండాపోయారు. అపరిష్కృత దరఖాస్తుల్లో అత్యధికంగా రెవెన్యూ సంబంధిత అంశాలే ఉన్నాయి. వీటిలో అగ్రభాగం మ్యూటేషన్లకు సంబంధించినవే. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జరిగిన క్రయ విక్రయాలు ఇతరత్రా రెవెన్యూ డాక్యుమెంట్ల అప్‌డేషన్‌ కోసం మీ సేవలోనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిన సంగతి తెలిసిందే. రెండోస్థానం కుల ధ్రువీకరణ దరఖాస్తులు. ప్రస్తుతం విద్యా సంస్థల్లో ప్రవేశాల సీజన్‌ కావడంతో కుల, ఆధాయ ధ్రువీకరణ దరఖాస్తుల సంఖ్య అమాంతం పెరిగే అవకాశం ఉంది.

స్టేషనరీ నిధులు స్వాహా... 
మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు చేరిన అర్జీలను ప్రింట్‌ అవుట్‌ తీసుకోవడం, వాటిని పరిశీలించి పరిష్కరించే క్రమంలో అవసరమైన స్టేషనరీ నిధులు ప్రభుత్వం ఆయా శాఖలకు విడుదల చేస్తోంది. ఒక్కో పేపర్‌ ప్రింట్‌ అవుట్‌కు రూ.2 వరకు చెల్లిస్తోంది. కానీ అర్జీదారుల నుంచి మాన్యువల్‌ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు స్టేషనరీ నిధులను స్వాహా చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు