వడివడిగా టీఆర్‌ఎస్‌ అడుగులు..

1 Jan, 2020 01:41 IST|Sakshi

‘పుర’పోరుకు పావులు కదుపుతున్న అధికార పార్టీ

క్షేత్రస్థాయి నుంచి అందుతున్న నివేదికలు

జనవరి 2న సీఎం కేసీఆర్‌తో జరిగే భేటీ వాయిదా

ఈ నెల 5 లేదా 6 తేదీల్లో సమావేశానికి అవకాశం

మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాల్లో బిజీ

మున్సిపోల్స్‌ ఇన్‌చార్జులుగా మండల స్థాయి నేతలు

అభ్యర్థుల ఎంపికలో వీరు ఇచ్చే నివేదికలే కీలకం

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల తేదీ సమీపిస్తుండటంతో ‘పురపోరు’లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్‌ఎస్‌ శరవేగంగా పావులు కదుపుతోంది. ఈ నెల 27న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జీల సమావేశంలో మున్సిపాలిటీల వారీగా టీఆర్‌ఎస్‌ పరిస్థితిపై మరోసారి నివేదికలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. డిసెంబర్‌ 31లోగా మున్సిపాలిటీలు, వార్డుల వారీగా పార్టీ పరిస్థితిపై మదింపు పూర్తి చేయాలని, జనవరి 2న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ‘మున్సిపోల్స్‌’పై దిశా నిర్దేశం చేస్తారని వెల్లడించారు. దీంతో పార్టీ ఇన్‌చార్జులు రూపొందించిన నివేదికలను పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు సేకరిస్తున్నారు.

గత మున్సిపల్‌ ఎన్నికలు, 2018 అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో వార్డులు, మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితి, వార్డు స్థాయిలో పార్టీపరంగా చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు, తటస్థులు, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారు తదితర వివరాలను నివేదికల్లో పొందుపరుస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు గాను 70 శాతం మున్సిపాలిటీలకు సంబంధించిన నివేదికలు అందినట్లు సమాచారం. వీటిని బుధవారం సాయంత్రంలోగా కేటీఆర్‌కు అందజేయనున్నారు.

కేసీఆర్‌ భేటీ వాయిదా 
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు జనవరి 2న పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ కావాల్సి ఉంది. అయితే మున్సిపాలిటీల వారీగా నివేదికలు రూపొందించేందుకు సమయం పడుతుండటంతో ఈ భేటీ 5 లేదా 6 వ తేదీన జరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. జనవరి 7న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతున్న నేపథ్యంలో, ఆ లోపే సీఎం కేసీఆర్‌తో జరిగే భేటీలో ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై తుది వ్యూహం ఖరారు చేస్తారు.

ఓ వైపు మున్సిపాలిటీల వారీగా ప్రచారం, సమన్వయ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు అప్పగిస్తూనే మరోవైపు రాష్ట్రస్థాయిలో కేటీఆర్‌ పర్యవేక్షిస్తారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీతో పాటు ఇతర చోట్ల అవసరాన్ని బట్టి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్‌ దూరంగా ఉండాలని నిర్ణయించారు. కేటీఆర్‌ పాల్గొనే ప్రచార సభలకు సంబంధించిన షెడ్యూలు ప్రణాళికను నామినేషన్ల పర్వం ముగిసే నాటికి సిద్ధం చేస్తారు.

మండల స్థాయి నేతలకు బాధ్యత 
మున్సిపాలిటీల వారీగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ స్థానిక నేతలు, క్రియాశీల కార్యకర్తలతో ప్రస్తుతం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత మున్సిపాలిటీకి సమీపంలో ఉండే మండలాల పరిధిలో.. ఒక్కో మండలం నుంచి కనీసం 30 నుంచి 40 మంది పార్టీ క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేశారు. వీరు కూడా మున్సిపాలిటీల్లో జరుగుతున్న సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. వీరిని బృందాలుగా విభజించి వార్డుల వారీ సమాచార సేకరణ కోసం ప్రత్యేక ఫార్మాట్‌ ఇచ్చారు.

మండలాల నుంచి వచ్చిన నేతలు, క్రియాశీల కార్యకర్తలు వార్డుల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రతి వార్డులో పార్టీ పరిస్థితి.. ఏ నేత బలంగా పనిచేస్తున్నారు.. ఏ సామాజికవర్గం ప్రభావం చూపుతుంది.. ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి అయితే గెలుపు అవకాశాలు ఉంటాయనే కోణంలో నివేదికలు తయారు చేస్తున్నారు. వీరు అందించే నివేదికలు పార్టీ అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదికగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

>
మరిన్ని వార్తలు