విద్యుత్‌పై మేధోమథనం!

17 Feb, 2019 03:25 IST|Sakshi

సీఎండీలు, డైరెక్టర్ల సమావేశం

సంస్థల లాభనష్టాలు, లక్ష్యాలపై చర్చ

ఆర్టిజన్ల సర్వీస్‌ రూల్స్‌కు ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలు పనిచేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్‌ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించామని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేసేందుకు పునరంకితం కావాలని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పవర్‌ కోఆర్డినేషన్‌ కమిటీ అధ్యక్షులైన ప్రభాకర్‌రావు నేతృత్వంలో జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు శనివారం ఇక్కడ సమావేశమై మేధోమథనం జరిపారు. ‘తెలంగాణ విద్యుత్‌ రంగానికి పునరంకితం’అన్న ప్రధాన ఎజెండాతో జరిగిన ఈ భేటీలో 24 గంటల విద్యుత్‌ సరఫరా, ఆదాయం పెంపు, నష్టాల తగ్గింపు తదితర కీలక అంశాలపై చర్చించారు. వచ్చే రబీ సీజన్‌లో గరిష్ట డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

లోటుపాట్లు సవరించుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు నిర్మిస్తున్న పవర్‌ ప్లాంట్ల నిర్మాణం పురోగతిపై చర్చించారు. వచ్చే నెల 2,3 తేదీలలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన ధర్మాధికారి కమిటీ సమావేశం ఉన్నందున ఈ విషయంలో తెలంగాణ విద్యుత్‌ సంస్థలు అనుసరించాల్సిన వ్యూహన్ని ఖరారు చేశారు. ఈ ఏడాది వర్షాకాలం నుండి కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి పంపింగ్‌ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సర్వసన్నధ్ధం కావాలని నిర్ణయించారు. రైతులకు 24 గంటల కరెంట్‌ ఇవ్వడంతో పాటు ఇతర రంగాలకు నిరంతరాయ విద్యుత్‌ అందిస్తున్నందున గరిష్ట డిమాండ్‌ వచ్చే అవకాశం వుంది. ఈ డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ అందించేందుకు అనుసరించాల్సిన వ్యూçహాన్ని సమావేశంలో ఖరారు చేశారు.

అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించినందున, వారి సర్వీసు నిబంధనలను చర్చించి ఖరారు చేశారు. ‘రైతులకు 24 గంటల పాటు కరెంట్‌ అందించాలి. ఈసారి ఎత్తిపోతల పథకాలకు కూడా ఎక్కువ కరెంట్‌ అవసరమవుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ సంస్థలు సరైన ప్రణాళికలు వేసుకుని ముందుకు పోవాలి. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఇప్పటికే ఎన్నో ఘనవిజయాలు సాధించాయి. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. ప్రజలకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించేందుకు పునరంకితం కావాలి’’అని ప్రభాకర్‌రావు ప్రారంభోపన్యాసంలో చెప్పారు. ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కె.గోపాలరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

ట్రాన్స్‌కో సీఎండీకి ఘన సన్మానం
విద్యుత్‌ రంగంలో యాభై ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావును విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు శనివారం ఘనంగా సన్మానించారు. తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్న డైరెక్టర్లు..ప్రభాకర్‌ రావు దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో జరిగింది.

మరిన్ని వార్తలు