దక్షిణాది ఇరిగేషన్‌ మంత్రుల భేటీ

14 Feb, 2018 03:11 IST|Sakshi

     20న నగరంలో సమావేశం

     హాజరుకానున్న కేంద్ర మంత్రి అర్జున్‌రాం మేఘవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖల మంత్రుల సమావేశం ఈనెల 20న హైదరాబాద్‌లో జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి అర్జున్‌రాం మేఘవాల్‌ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ మంత్రులు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకల్లోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించింది.

ఈ ప్రతిపాదనకు భిన్నంగా కొత్త ప్రత్యామ్నాయాన్ని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చింది. తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందనీ, దీనికి ప్రత్యామ్నాయంగా గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని కేంద్రం సూచిస్తోంది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరికి తరలించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇదివరకే కేంద్రం ఓమారు సమావేశం నిర్వహించగా, నీటి లభ్యత, ముంపు తదితర అంశాలపై అనేక అనుమానాలు లేవనెత్తింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరింది. అయితే దీనిపై మరింత అధ్యయనం, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్న కేంద్రం 20న దక్షిణాది రాష్ట్రాలతో భేటీ ఏర్పాటు చేసింది.
 

>
మరిన్ని వార్తలు