మెగా సోలార్ పార్కుకు ఓకే

24 Feb, 2015 00:57 IST|Sakshi
మెగా సోలార్ పార్కుకు ఓకే

- తొర్మామిడిలో ఎన్‌టీపీసీ ప్రతినిధి బృందం స్థల పరిశీలన
- 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు
 - 1300 ఎకరాలు కేటాయించాలని ఎన్‌హెచ్‌పీసీ లేఖ
- టీఐఐసీకి స్థల బదలాయింపు పనుల్లో జిల్లా యంత్రాంగం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు మెగా సౌర విద్యుత్ ప్లాంట్ రానుంది.

బంట్వారం మండలం తొర్మామిడిలో ఈ సోలార్‌పార్కును ఏర్పాటు చేసేందుకు నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ముందుకొచ్చింది. 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది నవంబర్‌లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, విద్యుత్ వ్యాపార్ నిగమ్(ఎన్‌వీవీ) సంస్థల ప్రతినిధులు తోర్మామిడిని సందర్శించారు. బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్న కేంద్ర సర్కారు సౌర విధానాన్ని ప్రకటించింది.

ఈ క్రమంలోనే సౌర విద్యుదుత్పాదన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే బంట్వారం అనుబంధ గ్రామమైన బస్వాపూర్ సర్వే నంబర్ 263లోని 1300 ఎకరాల విస్తీర్ణంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థల పరిశీలన జరిపిన ప్రతినిధి బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్‌హెచ్‌పీసీ మెగా సోలార్‌పార్కును నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఐఐసీ)కు ఎన్‌హెచ్‌పీసీ లేఖ రాసింది. ఈ క్రమంలో తక్షణమే ఈ భూమిని బదలయించాలని ఆదేశిస్తూ ఆ సంస్థ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు