‘మేఘా’ సిగలో మరో కీర్తి కిరీటం  

8 Sep, 2019 10:45 IST|Sakshi
అవార్డు అందుకుంటున్న ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి. చిత్రంలో ఈఎన్సీ వెంకటేశ్వర్లు తదితరులు

కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన సంస్థకు ఉత్తమ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌ అవార్డు 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇ్రన్ఫాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్‌ కాంక్రీట్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐసీఐ)నుంచి ఉత్తమ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌ అవార్డు అందుకుంది. కాంక్రీట్‌ డే సందర్భంగా ఐసీఐ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హోటల్లో కాంక్రీట్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీఐ అధ్యక్షుడు వినయ్‌ గుప్తా చేతుల మీదుగా ఉత్తమ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌ అవార్డును ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌ రెడ్డితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్, ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర కంపెనీల ప్రతినిధులు అందుకున్నారు. 

ఈ సందర్భంగా బి.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ..‘ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎంఈఐఎల్‌ భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన 1,500 మంది ఇంజనీర్లు, సిబ్బందికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేయగలిగాం’అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెజాన్‌ భవనానికి, ఖాజాగూడ నుంచి నానక్‌ రామ్‌గూడ వరకు ఏర్పాటు చేసిన వైట్‌ ట్యాపింగ్‌ రోడ్‌తో పాటు వివిధ జిల్లాల్లోని ఉత్తమ కాంక్రీట్‌ నిర్మాణాలకు కూడా అవార్డులు అందించారు.  

మరిన్ని వార్తలు