‘గిరి’ గ్రామాల్లో విత్తన పండగ

12 Jun, 2020 13:26 IST|Sakshi
నైవేద్యంతో పంటచేలకు వెళ్తున్న మహిళలు

ప్రారంభమెన ‘మొహతుక్‌’

అనాదిగా వస్తున్న ఆచారం

కెరమెరి(ఆసిఫాబాద్‌): అనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. ఇటీవల మృగశిర కార్తె  ప్రవేశించడంతో ‘గిరి’ గ్రామాల్లో రెండు రోజులుగా విత్తనపూజకు శ్రీకారం చుట్టారు. ఏటా విత్తన పూజతోనే తమ పొలాల్లో విత్తనాలు నాటడం  ప్రారంభిస్తారు.

దేవతలకు విత్తనాలను చూపిస్తారు
మేలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్‌ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్‌పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలు చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకీపేన్, అమ్మోరు, పొచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అక్కడ పటేల్‌ ఇచ్చే విత్తనాలను ఇంటికి తీసుకెళ్తారు. అదే రోజు రాత్రి రెండున్నర కిలోల జొన్నలను గడ్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్‌) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి అన్ని ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలను వేçస్తారు. ఇదంతా మృగశిర మాసానికి కొద్దిరోజుల ముందుగానే నిర్వహిస్తారు.

విత్తన పూజలు(మొహతుక్‌)
విత్తనపూజ చేసేరోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడతారు. జొన్నతో గడ్క తయారు చేసి కులదైవంతో పాటు నేలతల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామపటేల్‌ ఇంటి ఎదుట  మహిళలు సాంప్రదాయ నృత్యం చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. అనంతరం సహపంక్తి భోజనం చేస్తారు.

చంచి భీమల్‌ దేవుడి కల్యాణంతో..
మరికొందరు ఇలా చెప్తున్నారు. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్‌ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్‌లోనే విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆ రోజు ఆదివాసీలు భీమల్‌ దేవుడికి సాంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులోనే అన్ని విత్తనాలను కలిపి దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇంటికి తీసుకెళ్లి దాచిపెడతారు. ఆరోజు పిండివంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తే ప్రారంభంతో దాచిపెట్టిన విత్తనాలను తమ పంటపొలాల్లో చల్లుతారని మరికొందరు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు