కాళేశ్వరంలో ‘మేఘా’ పవర్‌!

30 May, 2020 04:04 IST|Sakshi

3,767 మెగావాట్ల పంపింగ్‌ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసి రికార్డు

22 పంపింగ్‌ కేంద్రాల్లో 9 కేంద్రాలను నిర్మించి వినియోగంలోకి తెచ్చిన ఎంఈఐఎల్‌

సాక్షి, హైదరాబాద్‌: లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని కీలకమైన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) దక్కించుకుంది. ప్రాజెక్టులోని అత్యధిక పంపింగ్‌ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసి ఎంఈఐఎల్‌ మరోమారు తన ఇంజనీరింగ్‌ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాన్ని చాటుకుంది. మొత్తం ప్రాజెక్టులో 4,680 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు, మోటార్లు ఏర్పా టు చేస్తుండగా, ఇందులో 3,840 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు, మోటార్ల పనులను చేపట్టిన ఎంఈఐఎల్‌.. అతి తక్కువ సమయంలోనే 3,767 మెగా వాట్ల పంపింగ్‌ కేంద్రాలను పూర్తి చేసి సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది.

‘కొండ పోచమ్మ’తో కీర్తి శిఖరాలకు.. 
కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్‌ కేంద్రాల్లో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. అందులో 15 పంపింగ్‌ కేంద్రాల్లో 89 పంపులు, మోటార్లను 3,840 మెగావాట్ల సామర్థ్యంతో మేఘా సంస్థ నిర్మిస్తోంది. ఇక రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్‌ చేసే విధంగా మేఘా సంస్థ నిర్మించిన కేంద్రాల్లో 9 వినియోగంలోకి వచ్చాయి. మరో 4 పంపింగ్‌ కేంద్రాలు సిద్ధంగా ఉండగా, మరో రెండు పంపింగ్‌ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పనులు ప్రారంభించిన మూడేళ్లలోనే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మొదటి దశలోని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్‌ కేంద్రాలు, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు రెండో దశ ఎత్తిపోతలో గాయత్రి (ప్యాకేజీ–8), నాలుగో దశలో మిడ్‌మానేరు నుంచి కొండ పోచమ్మ సాగర్‌ వరకు అన్నపూర్ణ (ప్యాకేజీ–10), రంగనాయక సాగర్‌ (ప్యాకేజీ–11), మల్లన్నసాగర్‌ (ప్యాకేజీ –12) కేంద్రాలను సంస్థ వినియోగంలోకి తేగా.. శుక్రవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఆరంభించిన అక్కారం, మర్కూక్‌ (ప్యాకేజీ–14) మోటార్లతో సంస్థ వినియోగంలోకి తెచ్చిన పంపుల సామర్థ్యం 3,767 మెగావాట్లకు చేరింది.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు బీహెచ్‌ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబీబీ, క్రాంప్టన్‌ గ్రేవ్స్, వెగ్‌ లాంటి సంస్థలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌కు నీటిని పంపింగ్‌ చేయడంలో ఎంఈఐఎల్‌ కీలక పాత్ర పోషించి కీర్తి దక్కించుకుంది. అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉండగా, ఆ తర్వాత లిబియాలోని గ్రేట్‌ మ్యాన్‌మేడ్‌ రివర్‌ రూపుదిద్దుకుంది. వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ–నీవా ఎత్తిపోతల పథ  కం పెదద్ది కాగా ఆ పథకంతో పోలిక లేని స్థాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పథకంగా ప్రస్తుతం కాళేశ్వరం ప్రపంచా న్ని ఆకర్షిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4,680 మెగావాట్ల విద్యుత్‌ అవసరముండగా, ఇందులో అత్యధికంగా 3,840 మెగావాట్ల విద్యుత్‌ వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాల విద్యుత్‌ సరఫరా సా  మర్థ్యం 3,916 మెగావాట్లైతే కాళేశ్వరంలో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసిన విద్యుత్‌ వ్యవస్థకు దాదాపు సమానంగా ఉంది.

సీఎం పట్టుదలతోనే..
‘ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్‌ అదృష్టం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు, బీడు భూములను సస్యశ్యామ  లం చేసేందుకు ప్రపంచంలో అత్యు త్తమ ఇంజనీరింగ్‌ సంస్థలతో కలసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవితకాలపు గౌరవంగా భావిస్తున్నాం. సీఎం చంద్రశేఖర్‌రావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే ఇంత తక్కువ కాలంలో ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం..’ – బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు