రక్షణ ఆయుధాల రంగంలోకి మేఘా

15 Jun, 2020 10:45 IST|Sakshi

మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా ఇంజనీరింగ్  (ఎంఈఐఎల్)

సాక్షి, హైదరాబాద్‌ : మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తాజాగా దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను, వివిధ పరికరాలను తయారు చేసేందుకు అనుమతులు సంపాదించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య పారిశ్రామిక శాఖల నుంచి ఆదేశాలు జారీ చేశాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఇందుకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ మంత్రిత్వ శాఖలు అనుమతులిచ్చాయి. 

కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా విధానంలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ 2020కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడి పరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకుంది..  వివిధ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంస్థ శక్తి-సామర్థ్యాలను పరిశీలించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ అనుమతులను జారీ చేసింది. వివిధ దశల్లో 500 కోట్ల పెట్టుబడితో మేఘా గ్రూప్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.  దేశంలో నిర్మాణ, మౌలిక వసతుల రంగంలో అడుగుపెట్టి ఆ తరువాత చమురు-ఇంధన వాయువు, విద్యుత్, సౌరవిద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ తాజాగా ఈ పరిశ్రమతో దేశ రక్షణకు సంబంధించిన పరికరాల ఉత్పత్తి రంగంలో ప్రవేశిస్తోంది. 

మేఘా గ్రూప్‌కి  చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్ర-సంకేతిక రంగాల్లో సహాయ-సహకారాలు అందిస్తున్న విషయం విదితమే. ఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్  కమ్యునికేషన్ తో పాటు విద్యుత్ ప్రసారం పంపిణీ, సౌర రంగల్లో కూడా నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అధునాతన కమ్యూనికేషన్ రెడియోలు, జామర్లు, ఈడబ్లూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్  రాడర్లను అభివృద్ధి  చేసి సరఫరాలో నిమగ్నమయి ఉంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. 

ఎంఈఐఎల్ ఏర్పాటు చేసే డిఫెన్స్ పరిశ్రమలో యుద్ధ ట్యాంకులు వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధవాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్ను ఉత్పత్తి చేయనుంది. అదే విధంగా సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపిసి) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసివి), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగలిగే తేలిక పాటి యుద్ధ వాహనాలు (ఏసిటివి) మొదలైనవి ఉత్పత్తి చేయనుంది. అదే విధంగా మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్), మిస్సయిల్స్ వ్యవస్థను ఉపయోగించడానికి అనుకూలమైన ఎక్విప్‌మెంట్‌ను కూడా ఉత్పత్తి చేయనుంది. 

మేఘా ఇంజనీరింగ్...... దేశ, విదేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్‌ పూర్తి చేసింది.  సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం, సహజ-చమురు , తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పంపిణీ, రోడ్డు మార్గాల ఆధునీకరణ, విస్తరణ విమానాయన రంగాలో ఎన్నో విజయాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఎత్తిపోతల పథకం హంద్రీనీవా సుజల స్రవంతిని నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మేఘా అత్యంత సుదూర ప్రాంతాలకు, ఎత్తైన ప్రాంతానికి నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పంపింగ్ చేస్తోంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం, పట్టిసీమ, నంబులపూలకుంట (ఎన్పీకుంట) విద్యుత్ సబ్ స్టేషన్ ను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత ’మేఘా‘ది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ లోని 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, గుజరాత్ లో 10 మెగావాట్ల అరుదైన కెనాల్ టాప్ సోలార్ ప్రాజెక్టు ఎంఇఐఎల్ నిర్మించి రికార్డ్ నెలకొల్పింది. 

కృష్ణా-పెన్నా, కృష్ణా-గోదావరి, గోదావరి-ఏలేరు, నర్మద- క్షిప్రా - సింహస్థ ఇలా దేశంలో ఐదు నదులను మొదటి సారిగా అనుసంధానం చేసింది.  హైదరాబాద్ సిటీ తాగునీటి కష్టాలను దూరం చేయడానికి ఆసియాలోనే అతిపెద్ద తాగునీటి పథకాన్ని ఎంఇఐఎల్ నిర్మించడం మరో ఘనత.  దేశంలోనే తొలిసారిగా అత్యంత పెద్దదైన వెస్ట్రన్ యూపి పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ (WUPPTCL) విద్యుత్ సరఫరా (పవర్ ట్రాన్స్‌మిషన్) వ్యవస్థను నిర్మించింది. 

ఈ ప్రాజెక్ట్ దేశంలో 29 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పాధక సామర్థ్యంతో పోలిస్తే ఈ సరఫరా వ్యవస్థ 5వ స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్ నైపుణ్యాలను దేశంలో అనేక ప్రాజెక్టు లను తొలిసారిగి ప్రవేశపెట్టింది. ఎన్పీకుంట విద్యుత్ సబ్ స్టేషన్, పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ఏడాదిలోనే పూర్తిచేసినందుకు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

మరిన్ని వార్తలు