ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా..

20 Apr, 2020 20:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో ఉప్పల్‌ పరిధిలో ఉపాధి లేక తిండి దొరక్క ఆకలితో అవస్థలు పడుతున్న వారిని స్థానికంగా ఉండే మేకల కుటుంబ సభ్యులు ఆదుకుంటున్నారు. ఉప్పల్ రింగ్‌ రోడ్డ దగ్గర మెట్రోవెనుక వైపున, రోజు వారి కూలీ చేసుకుని నివసిస్తూ దాదాపుగా 200 కుటుంబాలున్నాయి. అందులో కొంత మంది వినాయక ప్రతిమలు చేసుకుంటుండగా, మరికొంత మంది యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ దెబ్బకు ఇప్పుడా కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి.

అలాంటి దాదాపుగా 200 బుడిగ జంగం కుటుంబాలకు మేకల బాల్‌రెడ్డి, ఆయన భార్య మేఘమాలతోపాటూ కుటుంబ సభ్యులు అందరు కలిసి వారి ఆకలి తీర్చుతున్నారు. వీరితోపాటూ జీహెచ్‌ఎంసీ కార్మికులు, రోడ్డు మీద, బస్టాండ్లలో ఉండే బిచ్చగాళ్లకు సైతం ఆకలి, దప్పికల్ని తీర్చుతూ ఆదుకుంటున్నారు. మార్చి 22 నుంచి రోజుకు 500 చొప్పున భోజన ప్యాకెట్లను తయారు చేసి ఇస్తున్నామని ఇపుడు లాక్‌డౌన్‌ పెంచిన నేపథ్యంలో మే 7 వరకు కూడా భోజన సదుపాయం కల్పిస్తామని మేకల బాల్ రెడ్డి తెలిపారు. ఇంట్లో కిరాయికిఉండే వారితో కలిసి రోజుకు 500 మందికి వంట చేస్తున్నామని, తాము ఇంట్లో ఏం తింటామో అదే వారికి వండిపెడుతున్నామని అందులో ఆనందం ఉందని మేఘమాల చెపుతున్నారు.

మరిన్ని వార్తలు