ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం

2 Dec, 2014 02:02 IST|Sakshi
ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం

టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తోందని.. ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూ స్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఇంద్రవెల్లిలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. - ఉట్నూర్/ఇంద్రవెల్లి
 

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
ఉట్నూర్/ఇంద్రవెల్లి : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇంద్రవెల్లిలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ఆదివాసీ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వం తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రజలకు నమ్మశక్యం కాని హామీలిస్తున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అధికారంలోకి రాగానే లక్ష రూపాయల రుణమాఫీ అన్న కేసీఆర్ ఏడాదికి 25 శాతం అనడంతో వడ్డీ రైతులకు అదనపు భార మైందన్నారు. ప్రభుత్వం చర్యలతో రైతాంగానికి బ్యాంకులు ఖరీఫ్, రబీ సీజన్‌లో రుణాలు ఇవ్వని పరిస్థితి దాపురించిందన్నారు. అప్పులు తీర్చలేక ఇప్పటికే రాష్ట్రంలో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం రద్దు చేసి ఫాస్ట్ పథకం తెచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థికి లాభం చేకూర్చింది లేదన్నారు.

దళితులకు మూడెకరాల భూమి ఉత్త మాటేనని ఎద్దేవా చేశారు. డబ్బుల్ బెడ్‌రూంలు నిర్మించి ఇస్తామని చెప్పి గృహ నిర్మాణ శాఖకు బడ్జెట్‌లో కేటాయించింది వెయ్యి కోట్లేనని పేర్కొన్నారు. పాత బకాయిలే రాష్ట్రంలో 2400 కోట్లు ఉన్నాయన్నారు. కేంద్ర పథకాలు రా6ష్టంలో అమలయ్యేలా బీజేపీ చర్యలు తీసుకుంటుందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు గిరిజనులు ప్రతిబింబాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గిరిజన విద్యాభివృద్ధికి ఇక్కడే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటయ్యేలా కృషి చేస్తానన్నారు. గిరిజనం అంటేనే అమాయకులని వారిలో రాజకీయ, విద్య, చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పార్టీలోని ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.

గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసే ఐటీడీఏలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించకపోవడం ప్రభుత్వం తప్పిదమన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో రెండు వందల మంది పార్టీ సభ్యత్వ నమోదు చేయించడం లక్ష్యమన్నారు. తద్వారా జిల్లాలో పార్టీ సభ్యత్వం రెండు లక్షలు చేరుతుంద న్నారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జాతీయ కార్యదర్శి గుగ్లావత్ శ్రీ రాంనాయక్, స్వచ్ఛ భారత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్, జిల్లా అధ్యక్షుడు అయన్నగారి భూమన్న, ఉపాధ్యక్షుడు మాడవి రాజు, కిషాన్ మోర్చా అధ్యక్షుడు దీపక్ సింగ్ షెకావత్, యువ మోర్చా అధ్యక్షుడు పెందోర్ ప్రభకర్, మహిళ మోర్చా ఉపాధ్యాక్షురాలు గంగుబాయి, జిల్లా కార్యదర్శి కొమ్ము రాంచందర్, దళిత మోర్చా కార్యదర్శి కాటం రవీందర్, ఖానాపూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి కొండెరి రమేష్, మండల అధ్యక్షుడు మరప రాజు, నాయకులు పాయల శంకర్, బాబులాల్, మిల్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. తదుపరి ఐటీడీఏ ఎదుట ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న సీఆర్టీల దీక్షను సందర్శించారు. ఈ సందర్భంగా సీఆర్టీలు కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.

మరిన్ని వార్తలు