ప్రజల గుండెల్లో వైఎస్

31 Aug, 2014 23:18 IST|Sakshi
ప్రజల గుండెల్లో వైఎస్

సంగారెడ్డి క్రైం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు మెతుకు సీమ లో ఎందరో నిరుపేదలు, అభాగ్యులకు అండ గా నిలిచాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ, ఉచిత కరెంట్, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, బంగారుతల్లి, సామాజిక పెన్ష న్లు, ఆరోగ్యశ్రీ వంటి లెక్కకు మించి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిర్విరామంగా కొనసాగించిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. మనసున్న నేతగా అన్ని వర్గాల ప్రజల్లో ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంద ని తెలిపారు.
 
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న జిల్లా వ్యాప్తంగా సంస్మరణ సభలు నిర్వహిస్తామని తెలిపారు. దీనికోసం తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అన్నదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ హయాంలో అమలైన అన్ని సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
మహానేత పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని రుణ మాఫీ, ఉచిత కరెంట్, రుణాల రీ షెడ్యూల్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు. వైఎస్ చేసిన కృషి వల్లే జిల్లాకు సింగూరు సాగు జలాలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, వైద్యనాథ్, అంతయ్య, పరశురాం, పాండు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు