కు.ని. ఆ‘పరేషాన్‌’ మాకొద్దు..!

26 Apr, 2018 08:52 IST|Sakshi
కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న వైద్యులు(ఫైల్‌)

కు.ని.కి..పురుషులు దూరం

జిల్లాలో 99శాతం ట్యూబెక్టమీ ఆపరేషన్లే..

వేసెక్టమీకి వెనుకడుగు వేస్తున్న పురుషులు

మగవాళ్లకు అవగాహన కల్పించడంలో వైద్యశాఖ విఫలం

జిల్లాలో ఇప్పటికీ అందుబాటులో లేని వేసెక్టమీ సర్జన్‌

గత పదిహేను రోజుల క్రితం వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. అయితే ఇక్కడ ఒక్క పురు షుడు కూడా ఆపరేషన్‌ కోసం కనీసం పేరు నమోదు చేసుకోలేదు. ఇక్కడ 24 ఆపరేషన్లు జరగగా అందులో ఒక్క వేసెక్టమీ ఆపరేషన్‌ జరగలేదు.  

సాక్షి, ఆసిఫాబాద్‌క్రైం: జిల్లాలో గతేడాది 1,793 ఆపరేషన్లు జరగగా అందులో కేవలం 17 మంది మగవాళ్లు మాత్రమే ఆపరేషన్‌ కోసం ముందుకొచ్చారు. మిగతా మహిళలకు అటు ప్రసవ వేదనతోపాటు ఈ కు.ని ‘కోతలు’ తప్పడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో  వేసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు అని రెండు రకాలు ఉంటాయి. ఇందులో పురుషులకు చేసే ఆపరేషన్‌ను వేసెక్టమీ, మహిళలకు చేసే ఆపరేషన్‌ను ట్యూబెక్టమీ అని పిలుస్తారు. కొంతమంది మహిళల్లో రెండు మూడు కాన్పులు వరుసగా సిజేరియిన్‌ అయి, తిరిగి కుటుంబ నియంత్రణ కోసం ట్యూబెక్టమీ ద్వారా పొట్టను నాలుగు, అయిదు అంగుళాలు మేర కోతకోయడంతో  భవిష్యత్‌లో మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

అవగాహన లేకే వెనుకడుగు
గ్రామీణ ప్రాంతాల్లో అధిక భాగం పిల్లలు కాకుండా ఆపరేషన్‌ చేయించుకోవాలంటే అది ఆడవాళ్లకు సంబంధించినదిగా భావించడం. దీనిని అధిగమించేందుకు వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఉండే ఆశ, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు ప్రతీ ఇంటా విస్త్రృత ప్రచారం నిర్వహించాల్సి ఉన్నా అలాంటి కార్యక్రమాలేవి లేకపోవడంతో ప్రసవ సమయంలోనే చాలా మంది మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. మగవారిలో చాలా మందికి వాసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకోవడం ద్వారా శారీరకంగా బలహీన మవుతామనే అపోహాతో పురుషులు ఈ ఆపరేషన్లు చేయించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ ఆపరేషన్లు చేసుకుంటే శారీరక శ్రమ చేయలేమనే భావనతో మగవాళ్లు వెనుకడుగు వేస్తున్నారు.


స్త్రీల కంటే పురుషులకే సులభం
మహిళల కంటే పురుషులకే కు.ని. ఆపరేషన్‌ ఎంతో సులువుగా ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు. మగవాళ్లకు చేసే కు.ని.ఆపరేషన్‌లో గతంలో కోత విధానం ఉండేది. కాని ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. ఇందుకోసం ఎన్నో అధునాతన పద్ధతులు వచ్చాయి. సాధారణ ఇంజక్షన్‌ వేసుకున్న తరహాలో ఆపరేషన్లు అయిపోతున్నాయి. రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వ్యవధిలోనే వేసెక్టమీ పూర్తవుతుంది.

గంటలోపే డిశ్చార్జీ కావచ్చు. మూడు నెలల తర్వాత నిత్యం జీవితంలో చేసే అన్ని పనులన్నీ సక్రమంగా చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నా లేనిపోని అపోహాలతో పురుషులు కు.ని. ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా మహిళలకు కోతలు తప్పడం లేదు.
దృష్టి సారించని వైద్య ఆరోగ్యశాఖ
జిల్లాలో వేసెక్టమీ ఆపరేషన్లు సంఖ్య పెరిగేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో తన సర్వీసులో ఒక్క వాసెక్టమీ ఆపరేషన్‌ చేయలేదని ఓ సీనియర్‌ వైద్యుడు చెప్పడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వేసెక్టమీ ఆపరేషన్లు పెరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కొంత మేరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.

అందుబాటులో లేని సర్జన్‌
జిల్లాలో ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేయాలంటే గైనకాలజీ డాక్టర్‌ ఎవరైనా చేయొచ్చు. అదే మగవారికి వాసెక్టమీ ఆపరేషన్‌ చేసేందుకు ప్రత్యేక వేసెక్టమీ సర్జన్‌ అవసరం. అయితే జిల్లాలో కనీసం ఒక్క సర్జన్‌ కూడా లేకపోవడంతో ఈ ఆపరేషన్లు జరగకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో 1,793 కుటుంబం నియంత్రణ ఆపరేషన్లు జరగగా అందులో 99 శాతం మహిళలే ఉన్నట్లు జిల్లా వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు.

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులు వెనుకడుగు వేస్తున్న మాట వాస్తవమే. ఇందుకు ప్రధాన కారణం అవగాహన లేకపోవడమే. ఇందుకోసం  వైద్య సిబ్బందితో వాసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో వేసెక్టమీ ఆపరేషన్లు చేసే నిపుణుడు లేకపోవడం సమస్యగా మారింది.
– డాక్టర్‌ సుబ్బారాయుడు,డీఎంహెచ్‌వో

మరిన్ని వార్తలు