మాంజా..పంజా..

17 Jan, 2019 09:07 IST|Sakshi

చైనా మాంజా తగిలి తెగిన యువకుని గొంతు

తృటిలో తప్పిన ప్రాణాపాయం..

మ్యాక్స్‌క్యూర్‌లో చికిత్స  

సాక్షి, సిటీబ్యూరో:  బైక్‌పై వేగంగా ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిని చైనా మాంజా రూపంలో ప్రమాదం వెంటాడింది. అయితే సకాలంలో వైద్యసేవలు అందడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్బుల్‌ కటింగ్‌ వర్క్‌ చేసే శామీర్‌పేట బాలాజీనగర్‌కు చెందిన అశోక్‌గుప్తా (33) మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు పని ముగించుకుని బైక్‌పై జవహర్‌నగర్‌ నుంచి ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో గాలికి వేలాడుతున్న ఓ చైనా మాంజా ఆయన మెడకు బలంగా తగిలింది. దీంతో ఆయన గొంతుపై సుమారు పది సెంటిమీటర్ల పొడవు, అర సెంటి మీటరు గాయమై లోతుగా తెగింది.

రక్తమోడుతున్న ఆయనను చికిత్స కోసం బంధువులు స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాధమిక చికిత్స అనంతరం ఆయనను  మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సచివాలయం సమీపంలోని మాక్స్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెనీ విభాగం అధిపతి డాక్టర్‌ సతీష్, ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ శివరామ్‌ నేతృత్వం లోని వైద్య బృందం వెంటనే ఆయనను ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించి గాయానికి కుట్లు వేశారు. రక్తస్త్రావాన్ని నివారించి, ప్రాణాపాయం నుంచి రక్షించారు. అదృష్టవశాత్థు ప్రధాన రక్తనాళాలతో పాటు కీలకమైన శ్వాసనాళాలకు ఎలాంటి గాయం కాకపోవడంతో అశోక్‌గుప్తాకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం  ఆయన కోలుకుంటున్నాడు. మరో నాలుగైదు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసే అవకాశం ఉందని వైద్యనిపుణులు స్పష్టం చేశారు. 

సింథటిక్‌ దారాలకు మెటల్‌ కోటింగ్‌ వల్లే..
సంక్రాంతి  సెలవుల్లో పిల్లలు, పెద్దలు పతంగులు ఎగరేయడం తెలిసిందే. పతంగులకు సంప్రదాయ కాటన్‌ దారానికి బదులు తక్కువ ధరకు వచ్చే చైనా మాంజా వాడటం, వాటికి సింథటిక్, గ్లాస్, మెటల్‌ కోటింగ్‌ వేయడం వల్ల అవి శరీరానికి తగిలినప్పుడు కోసుకుపోతుంటాయి. ఈ మాంజా కోసుకుపోవడం వల్ల శరీరంపై లోతైన గాయాలు కావడంతో పాటు  ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు