బ్యాంకుల విలీనంతో ఆర్థిక సంక్షోభం

6 Sep, 2019 11:13 IST|Sakshi
మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

రాష్ట్రంలో పాలన గాడి తప్పింది

భవిష్యత్‌లో వామపక్షాలతో ఐక్య పోరాటాలు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

సాక్షి, సుజాతనగర్‌: కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను విలీనం చేయడం వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధి రేటు 7 శాతం అని కేంద్రం అంటున్నా అది 5 శాతానికి మించలేదన్నారు. ప్రైవేటీకరణలో భాగంగానే బ్యాంకులను కుదించారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు.

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్డెట్, ఇతర అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రజలకు మొండి చెయ్యే మిగిలిందని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని, ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. నిరుద్యోగభృతి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదన్నారు.

పెట్టుబడి సాయం కోసం 9 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు మొదలైందని, ఇటీవల మంత్రి ఈటెల రాజేందర్‌ చేసిన  వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని చెప్పారు. రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఇతర వామపక్ష పార్టీలను కలుపుకుని ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట రాష్ట నాయకులు కాసాని ఐలయ్య, మండల కార్యదర్శి వీర్ల రమేష్‌ ఉన్నారు.

>
మరిన్ని వార్తలు