ప్రతిభకు పురస్కారం..

15 Jun, 2014 00:24 IST|Sakshi
ప్రతిభకు పురస్కారం..

 ‘జ్ఞానసరస్వతి’ సేవలు ప్రశంసనీయం
 
 రవీంద్రభారతిలో శనివారం జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.  121 మంది విద్యార్థినీ, విద్యార్థులు, ఐదుగురు హెచ్‌ఎంలు పురస్కారాలు అందుకున్నారు.
 
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని వైపుల నుంచి వికాసం ఉంటుందన్నారు. సమాజానికి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్థులు ఎదగాలని చెప్పారు.
 
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే ఎవరెస్ట్ ఎక్కిన పూర్ణ, ఆనంద్‌లాగా రాణిస్తారన్నారు. విద్యార్థుల్లో అన్ని సామర్థ్యాలు పెంపొందించేందుకు జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ చేసే కృషి విలువకట్టలేనిదని తెలిపారు. హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతి స్వామిజీ మాట్లాడుతూ భారతీయుల్లో ఆధ్యాత్మికత మెండు అని తెలిపారు. ఆంగ్లేయుడు మెకాలే ఆంగ్లవిద్యను దేశంలో ప్రవేశపెట్టి మన సంస్కృతిని నాశనం చేశారన్నారు. సమాజానికి ఉపయోగపడే విద్యను అందరూ అభ్యసించాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి నిజాయితీతో చదవాలన్నారు.
 
జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ వారి ఉన్నతి కృషి చేస్తుందని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ జ్ఞానసరస్వతీ ఫౌండేషన్‌వారు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పొత్సహించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ, ప్రతిభా పురస్కారాలు అందజేయటం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 121 మంది విద్యార్థినీ-విద్యార్థులకు, జిల్లాలోని ఐదు మంది హెచ్‌ఎంలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆరవ తరగతి విద్యార్థినీ శ్రీహిత పాడిన వందేమాతర గీతం ఆకట్టుకుంది. సంధ్య, వైష్ణవీ, శారద, ఓంకార్‌ల నృత్యప్రదర్శలు ఆలరించాయి. కార్యక్రమంలో జిల్లా ఆర్‌వీఎం ప్రోగ్రాం ఆఫీసర్ కిషన్‌రావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాసనిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర, యోగా గురువు శశిధర్, డిప్యూటీ ఈవో హరిచందర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు