బిల్లుల మోతే..!

7 May, 2019 07:18 IST|Sakshi

సమ్మెలో మీటర్‌ రీడింగ్‌ కార్మికులు

స్తంభించిన విద్యుత్‌ బిల్లుల జారీ

మారిన స్లాబ్‌రేట్‌తో భారీగా బిల్లులు

పట్టించుకోని అధికారులు..

ఆందోళనలో వినియోగదారులు  

సాక్షి, సిటీబ్యూరో: కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ తెలంగాణ విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మీటర్‌ రీడింగ్‌ కార్మికులు సమ్మెకు దిగారు. ఫలితంగా విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ స్తంభించిపోయింది. సాధారణంగా ప్రతి నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మీటర్‌రీడింగ్‌ నమోదు చేస్తుంటారు. బిల్లుల చెల్లింపునకు 15 రోజుల గడువు ఇస్తుంటారు. నిర్ధేశిత గడువు దాటిన తర్వాత అపరాధ రుసుం వసూలు చేస్తారు. సకాలంలో మీటర్‌ రీడింగ్‌ నమోదు చేయక పోవడం వల్ల స్లాబ్‌రేట్‌ మారిపోయి నెలసరి విద్యుత్‌ బిల్లులో భారీ వ్యత్యాసం నమోదవుతుంది. నెలకు సగటున రూ.350 చెల్లించే వినియోగదారుదు స్లాబ్‌ మారిపోవడం వల్ల రూ.600పైగా చెల్లించాల్సి వస్తుంది. రెట్టింపు బిల్లులతో వినియోగదారులు నష్టపోతుంటే..చెల్లింపులు లేకపోవడంతో సంస్థకు రావాల్సిన ఆదాయం భారీగా నిలిచిపోతోంది. అజమాబాద్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, కీసర, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో బిల్లుల జారీ నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.  

ఒక్కో డివిజన్‌లో ఒక్కో రేటు...
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలో 1.43 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి నెలకు రూ.450 కోట్లకుపైగా బిల్లింగ్‌ రూపంలో వస్తుంది. రెగ్యులర్‌ ఏఈలు, లైన్‌మెన్‌లు, ఆర్టిజన్‌ కార్మికులు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల సిబ్బంది కొరత కారణంగా మీటర్‌ రీడింగ్‌ పనులను ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించింది. డిస్కం పరిధిలో సుమారు 1450 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిని పీస్‌రేట్‌ కార్మికులుగా వ్యవహరిస్తుంటారు. వీరు రోజుకు సగటున 200 నుంచి 400 బిల్లులు జారీ చేస్తుంటారు. ఇందుకు ఒక్కో బిల్లుకు రూ.3 ఇస్తుండగా, సదరు ఔట్‌ సోర్సింగ్‌ మీటర్‌ రీడింగ్‌ కాంట్రాక్టర్‌ కార్మికులకు 90 పైసల నుంచి రూ.1.50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికితోడు ఒక్కో డివిజన్‌లో ఒక్కో విధంగా చెల్లిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై కార్మికులతో చర్చించి సమ్మెను విరమింపజేయాల్సిన డిస్కం ఉన్నతాధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకా దు క్షేత్రస్థాయిలో ఉన్న కొంత మంది అధికారులు వెంటనే మీటర్‌ రీడింగ్‌ మిషన్లను తమకు అప్పజెప్పాలని, లేదంటే కేసులు పెడతామని కార్మికులకు హెచ్చరికలు జారీ చేస్తుండటం విశేషం.

ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే : విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ అసోసియేషన్‌
సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు ఉపాధి భద్రత కల్పించి, ఈఎస్‌ఐ, ఈఫీఎఫ్‌ సదుపాయాలను వర్తింపజేయాలని అప్పటి వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. నెలలో పదిరోజులు మాత్రమే ఉపాధి ఉంటుందని, రూ.4000 వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందన్నారు. ప్రతి మీటర్‌ రీడింగ్‌ ఉద్యోగికి నెలకు 30 రోజుల పనిదినాలు కల్పించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నెలకు రు.18వేల వేతనం, ఈఎస్‌ఐ, ఈపీఫ్‌ సదుపాయాలు కల్పించాలని, ఆర్హులైన రీడర్స్‌ను ఆర్టిజన్స్‌గా గుర్తించి ఉద్యోగ క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలోని ఆయా సబ్‌స్టేషన్లు, డీఈ, ఎస్‌ఈ కార్యాలయాల ముందు ధర్నాకు దిగారు.  

మరిన్ని వార్తలు