ఎస్..మార్చాల్సిందే!

20 Jun, 2014 00:29 IST|Sakshi
ఎస్..మార్చాల్సిందే!
  •    మెట్రో అలైన్‌మెంట్‌పై సీఎం స్పష్టీకరణ
  •      వెల్లడించిన మెట్రోరైలు వర్గాలు
  •      తర్జనభర్జన పడుతున్న అధికారులు
  • సాక్షి,సిటీబ్యూరో: సుల్తాన్‌బజార్,మోజంజాహీమార్కెట్, గన్‌పార్క్, అసెంబ్లీ మార్గాల్లో మెట్రోరైలు మార్గాన్ని భూగర్భ మార్గానికి(అండర్‌గ్రౌండ్)మార్చాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేసినట్లు మెట్రోరైలు అథారిటీ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ,మున్సిపల్ పరిపాలన ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి,హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిలతో సమావేశమైన సీఎం ఈమేరకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నాయి.

    ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల స్థూపం, సుల్తాన్‌బజార్ చారిత్రక మార్కెట్ల ప్రాధాన్యతను తగ్గించేలా మెట్రోమార్గం ఉండరాదని స్పష్టం చేసినట్లు తెలిపారు. కోఠి-అసెంబ్లీ మార్గంలో మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై సాంకేతిక నిపుణులతో విస్తృత అధ్యయనం చేయించాలని,ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సీఎం సూచించాయన్నారు. ముందుగా అనుకున్న గడువు ప్రకారం మెట్రో పనులు పూర్తిచేయాలని,ఎక్కడైనా పనులకు అడ్డంకులున్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సీఎం ఆదేశించారని ఆ వర్గాలు చెప్పాయి.
     
    2.15 ఎకరాల రక్షణ శాఖ స్థలం కేటాయింపు : పెరేడ్‌గ్రౌండ్(సికింద్రాబాద్) ఇంటర్‌ఛేంజ్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి 2.15 ఎకరాల రక్షణశాఖ స్థలాన్ని కేటాయించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతించింది. ఇందుకు ప్రతిఫలంగా పాతగాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో 1.68 ఎకరాల విస్తీర్ణంలో సైనికుల విశ్రాంతి సముదాయాన్ని హెచ్‌ఎంఆర్ నిధులతో నిర్మించేందుకు పరస్పర అంగీకారం కుదిరిందని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.

    ఈ ప్రతిపాదనలు గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో కేంద్రరక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపాయన్నారు. కాగా మూడు మెట్రో కారిడార్ల పరిధిలో 3.65 ఎకరాల రక్షణశాఖ స్థలాలను అద్దె ప్రాతిపదికన వినియోగించుకునేందుకు రక్షణమంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు.
     
    వడివడిగా పనులు : కారిడార్-2,కారిడార్-3 రెండూ ఒకేచోట కలవనున్న పెరేడ్‌గ్రౌండ్స్ ప్రాంగణంలో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ నిర్మాణం ఎన్నో ఇంజనీరింగ్ సవాళ్లతో కూడిన ప్పటికీ పనులు వేగవంతం చేసినట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి. రెండేళ్ల వ్యవధిలోగా ఈ ప్రాంతంలో అధునాతన స్టేషన్ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు.

    ప్రస్తుతం మారేడుపల్లి డీసీపీ కార్యాలయం నుంచి ప్యారడైజ్‌లోని పీజీ కళాశాల వరకు పిల్లర్లపై సెగ్మెంట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. హరిహర కళాభవన్ వద్ద ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్ ఎత్తును మించి మెట్రో మార్గం వెళుతుందని,ఈ మార్గాన్ని పూర్తిచేయడం కూడా ఎన్నో వ్యయప్రయాసలతో కూడినదని తెలిపాయి.
     

మరిన్ని వార్తలు