అమీర్‌పేట్‌ టు ఎల్బీనగర్‌..

2 Jul, 2018 03:49 IST|Sakshi
మెట్రోరైల్‌

26 లేదా 27న ఈ మార్గంలో మెట్రో రైట్‌.. రైట్‌..! 

అక్టోబర్‌లో అమీర్‌పేట్‌ హైటెక్‌సిటీ రూట్లో పరుగు..  త్వరలో అధికారిక తేదీ ప్రకటించనున్న హెచ్‌ఎంఆర్‌ 

సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు 

మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు 

డీపీఆర్‌ రూపకల్పనలో ఢిల్లీ మెట్రో రైలు అధికారులు

సాక్షి, హైదరాబాద్ ‌: అమీర్‌పేట్‌–ఎల్బీనగర్‌ మధ్య మెట్రో రైలు పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులో(26 లేదా 27వ తేదీన) ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో మెట్రో రైలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 16 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అవసరమైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ట్రాక్షన్‌ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ రూట్లో రైళ్లకు 18 రకాల సామర్థ్య పరీక్షలను వరుసగా నిర్వహిస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో రైల్వే శాఖ పరిధిలోని కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ సైతం అందనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌(హెచ్‌ఎంఆర్‌) సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వ వర్గాలు కచ్చితమైన ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మార్గంలో నిత్యం సుమారు 75 వేల మంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అంచనా.  

అక్టోబర్‌లో అమీర్‌పేట్‌ హైటెక్‌సిటీ 
మరోవైపు అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ(13 కి.మీ.) మార్గంలో అక్టోబర్‌లో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. సైబర్‌టవర్స్‌ వద్ద మెట్రో రివర్సల్‌ ట్రాక్‌కు రీడిజైన్‌ చేయనుండటంతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఇక జేబీఎస్‌–ఎంజీబీఎస్‌(10 కి.మీ.) మార్గంలో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌(30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. నిత్యం 75–80 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. 

రెండోదశకు వడివడిగా అడుగులు.. 
మెట్రో రెండోదశ ప్రాజెక్టు(61.5 కి.మీ.) దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండోదశలో ప్రధానంగా ప్రస్తుత మూడు మెట్రో కారిడార్ల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీని పెంచే అంశంపైనే ప్రధానంగా సర్కారు దృష్టి సారించింది. రెండోదశపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ సమగ్ర అధ్యయనం జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు (30 కి.మీ.)మార్గాన్ని తొలివిడతగా చేపట్టనున్నారు. ఎల్బీనగర్‌–నాగోల్‌(5.5 కి.మీ.), బీహెచ్‌ఈఎల్‌–లక్డీకాపూల్‌(26 కి.మీ.) మార్గాల్లోనూ రెండో దశలో చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందుకు సుమారు రూ.10 వేల కోట్లు అంచనా వ్యయంగా ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ(డీపీఆర్‌)లో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు నిమగ్నమయ్యారు. ఆగస్టులో డీపీఆర్‌ సిద్ధంకానుంది. ఈ నివేదికతో రెండోదశ మెట్రో అలైన్‌మెంట్‌పై స్పష్టత రానుంది. మెట్రో తొలివిడత ప్రాజెక్టును పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన విషయం విదితమే. రెండోవిడతకు మాత్రం 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా సమకూర్చడం, మరో 60 శాతం నిధులను జైకా వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. 

పాతనగరానికి మెట్రో కష్టమే.. 
ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా(5.5 కి.మీ.) మార్గంలో మెట్రోకు బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ మార్గం లో సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, బాధితులకు పరిహారం చెల్లింపు అంశం జఠిలంగా మారుతోంది. పరిహారం చెల్లింపునకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారీ మొత్తంలో పరిహారం చెల్లింపు ఎలా జరుపుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిర్మాణ సంస్థ సైతం ఇదే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. 

మరిన్ని వార్తలు