కాలుష్యరహితం మెట్రో ప్రయాణం

25 Sep, 2018 02:14 IST|Sakshi
మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌. చిత్రంలో తలసాని, కేటీఆర్, నాయిని, దత్తాత్రేయ తదితరులు

అమీర్‌పేట్‌–ఎల్బీనగర్‌ మెట్రో రైలు ప్రారంభోత్సవంలో గవర్నర్‌ నరసింహన్‌  

సాక్షి, హైదరాబాద్‌: పెరుగుతున్న ఇంధన ధరలు.. కాలుష్యం నుంచి విముక్తి పొందేందుకు మెట్రో రైలులో ప్రయాణించాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ నగరవాసులకు సూచించారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అమీర్‌పేట్‌–ఎల్బీనగర్‌ మెట్రో మార్గాన్ని అమీర్‌పేట్‌ స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్, నాయిని, తలసాని, పద్మారావు, ఎంపీలు దత్తాత్రేయ, మల్లారెడ్డి తదితరులతో కలసి మెట్రో రైలులో ఎల్బీనగర్‌ వరకు ప్రయాణించారు. మధ్యలో ఎంజీబీఎస్‌ స్టేషన్‌లో దిగి అక్కడి వసతులను పరిశీలించారు. ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద మీడియాతో గవర్నర్‌ మాట్లాడారు. అందరూ మెట్రో రైలులో ప్రయాణిస్తే రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ ఉండదని, అంబులెన్స్‌లు ఫ్రీగా వెళ్లే వీలుంటుందని తెలిపారు.

వచ్చే డిసెంబర్‌ 15 నాటికి అమీర్‌పేట్‌–హైటెక్‌ సిటీ మెట్రో మార్గాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ప్రతి మెట్రో స్టేషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని.. ప్రయాణం సౌకర్యవంతంగా ఉందన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సు ప్రయాణం సహా షాపింగ్‌కు వీలుగా బహుళ ప్రయోజన సింగిల్‌ కార్డును త్వరలో వినియోగంలోకి తీసుకురావాలని మెట్రో అధికారులకు సూచించారు. ఉరుకుల పరుగుల జీవితం గడిపే నగరవాసులకు మెట్రో ప్రయాణంతోపాటు నిత్యావసరాలు, ఆహార పదార్థాలను సైతం స్టేషన్‌లో కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పించడం విశేషమన్నారు.  

దేశంలోనే నంబర్‌ 2... 
దేశంలో రెండో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు మనదే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు కూడా ఇదేనని తెలిపారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నగర మెట్రో ప్రాజెక్టు విశిష్టతలను తెలియజేశారు. ప్రపంచస్థాయిలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, సౌకర్యాలు కల్పించామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రీకాస్ట్‌ సెగ్మెంట్లతో వయాడక్ట్, స్టేషన్లను నిర్మించామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులు అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు. లాస్ట్‌మైల్, ఫస్ట్‌మైల్‌ కనెక్టివిటీ కోసం అధునాతన సైకిళ్లు, స్మార్ట్‌బైక్‌లు, జూమ్‌కార్లు, ఎలక్ట్రిక్‌ బైక్‌లను పలు స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఎల్బీనగర్‌–మియాపూర్‌ మార్గంలో నిత్యం లక్ష మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మెట్రో నిర్మాణం కోసం తొలగించిన చెట్లను ట్రాన్స్‌లొకేషన్‌ విధానంలో వేరొక చోట నాటామన్నారు.  

అనంతరం నగర మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు, ఎల్‌అండ్‌టీ సంస్థ అత్యధిక పెట్టుబడులు పెట్టేందుకు సహకరించిన ఆ సంస్థ ఆర్థిక సలహాదారు శంకరన్‌ను గవర్నర్‌ నరసింహన్‌ ఘనంగా సన్మానించారు. అనంతరం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, మేయర్‌ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్‌ బాబాఫసీయుద్దీన్, ఎంపీలు బండారు దత్తాత్రేయ, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమి షనర్‌ దానకిశోర్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా మెట్రో ప్రారంభోత్సవంలో ఎక్కడా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంతో అలకబూనిన దత్తాత్రేయ ఎంజీబీఎస్‌ స్టేషన్‌ వద్ద మెట్రో దిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

గవర్నర్, కేటీఆర్‌ స్మార్ట్‌బైక్‌ రైడ్‌... 
మెట్రో ప్రయాణం అనంతరం ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్‌బైక్‌ను గవర్నర్‌ రైడ్‌ చేస్తూ రాజ్‌భవన్‌కు వెళ్లారు. మంత్రి కేటీఆర్, ఎస్‌.కె.జోషి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, దానకిశోర్‌లు ఆయ న వెంట స్మార్ట్‌బైక్‌లను తొక్కుకుంటూ  వెళ్లారు. ఈ స్మార్ట్‌బైక్‌లు ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటాయని గవర్నర్‌ వివరించారు.


స్మార్ట్‌ బైక్‌ సైకిల్‌పై రాజ్‌భవన్‌కు వెళుతున్న గవర్నర్‌ నరసింహన్, కేటీఆర్‌

మరిన్ని వార్తలు