‘మెట్రో’ స్టేషన్లలో నిరంతర నిఘా

24 Jul, 2014 04:15 IST|Sakshi
‘మెట్రో’ స్టేషన్లలో నిరంతర నిఘా

సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటుతో పాటు బెంగళూరు, ఢిల్లీ నగరాలకు దీటుగా  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. బుధవారం నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో మెట్రో స్టేషన్లలో భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు, ఎల్‌అండ్‌టీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మెట్రో స్టేషన్లు, ట్రాక్, ఫ్లాట్‌ఫారాలు, టిక్కెట్ కేంద్రాలు, పార్కింగ్ స్థలాలు, స్కైవాక్‌లు, వయాడక్ట్ సెగ్మెంట్లు, మెట్రో ట్రాక్ పరిసరాలు, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ విభాగాల వద్ద సీసీటీవీల నిఘాతోపాటు, భద్రతా బలగాలతో నిరంతర పహారా ఏర్పాటు చేస్తామన్నారు. పహారా లేని ప్రాంతాల్లో సెన్సార్లు, బ్యాగేజీ తనిఖీ యంత్రాలు, మెటల్ డిటెక్టర్లు, సెక్యూరిటీ అలారాల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రైలు బోగీల్లోనూ వీడియో రికార్డు ఉంటుందన్నారు.

నగరంపై ఉగ్రవాద పడగనీడ ఉన్న నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, కౌంటర్ టైజం నిపుణుడు కె.సి.రెడ్డి, అడిషనల్ కమిషనర్ అంజనీకుమార్, జితేందర్, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టు డెరైక్టర్ ఎం.పి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు