సాహసమే శ్వాస.. ఆశయమే ఊపిరి

8 Mar, 2018 07:49 IST|Sakshi
లోకోపైలెట్‌ సుప్రియా సనమ్‌ కుటుంబ సభ్యులతో..

టీనేజ్‌లో ఉన్నవారికి పెద్ద బాధ్యత అప్పగిస్తే కంగారు పడతారు. ఆ బాధ్యత దేశ, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించింది అయితే భయపడతారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అందరి వేళ్లు అటువైపే చూపిస్తాయి. ఎంతో ఒత్తిడిలో కూడా ప్రతిభావంతంగా తనకు అప్పగించిన పని పూర్తి చేసి దేశప్రధాని చేత శభాష్‌ అనిపించుకుంది ‘సుప్రియా సనమ్‌’. ఈ పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గతేడాది నవంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి, ఇంకా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రయాణించిన మెట్రో రైల్‌ను విజయవంతంగా నడిపిన యువతి అంటే గుర్తుపడ్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా సుప్రియ తన మనోగతాన్ని, తన విజయ రహస్యాన్ని ‘సాక్షి’కి వివరించారు.

సాక్షి, సిటీబ్యూరో: సాహసమే శ్వాసగా సాగుతున్న సుప్రియ.. లక్ష్య సాధనలో సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. ఓటములను సమర్థంగా ఎదుర్కొని గమ్యాన్ని చేరుకోవాలని నేటి తరం అమ్మాయిలకు పిలుపునిస్తున్నారు. అవకాశాలు ఎవరో ఇస్తారని ఎదురు చూడటం కంటే ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిలిచి గెలిచి సాధించడమే ధీర వనితల లక్షణమంటున్నారు. లక్ష్య సాధనలో ఓసారి విఫలమైనా.. ప్రయత్నించడమే నేటి తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సిన జీవితపాఠం అంటున్నారు. 

ప్రస్థానం మొదలైందిలా..
‘మాది నిజామాబాద్‌ పట్టణంలోని కంఠేశ్వర్‌ ప్రాంతం. నాన్న ప్రమోద్‌కుమార్‌ ప్రైవేటు స్కూలు టీచర్‌. తర్వాత అదే పాఠశాలకు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. అమ్మ ప్రభావతి డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో పనిచేసేవారు. నేను, అన్నయ్య ప్రసన్న కుమార్‌ పిల్లలం. చిన్నప్పుడు పాఠశాల చదువు నిజామాబాద్‌లోనే సాగింది. బీటెక్‌ హైదరాబాద్‌లోని విజ్ఞానభారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మెకానికల్‌ పూర్తిచేశాను. ఎంటెక్‌ సీబీఐటీలో చేశాను. 

‘మెట్రో’లో అలా భాగమయ్యా..  
ఎంటెక్‌ ఫైనల్స్‌లో ఉన్నప్పుడు నగరంలో మెట్రో బూమ్‌ మొదలైంది. సాహసం.. సవాళ్లను ఎదుర్కొనేవారికి ఎల్‌అండ్‌టీ సంస్థ ఆహ్వానం పలికింది. వెంటనే అప్లై చేశాను. నాలుగు దశల పరీక్షలను పూర్తిచేసి మెట్రో లోకోపైలెట్‌గా ఎంపికయ్యాను. ఏడాది పాటు శిక్షణ పొందాను. ఛాలెంజింగ్‌ జాబ్‌ను నిత్యం ఎంజాయ్‌ చేస్తున్నా. 

మా ఇంట్లో వివక్ష లేదు..
మా తల్లిదండ్రులు ఎప్పుడూ నాపట్ల వివక్ష చూపలేదు. నేను చదవాలనుకున్న కోర్సులో చేర్పించారు. అన్నయ్యతో పాటే నేనూ క్రికెట్, బాస్కెట్‌బాల్‌ ఆడాను. నేను ఆడపిల్లను అన్న కోణంలో ఎప్పుడూ చూడలేదు. లోకోపైలెట్‌గా జాబ్‌లో చే రతానంటే ఓకే అన్నారు తప్ప ఎక్కడా నో చెప్పలేదు. నా సక్సెస్‌లో నా తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది. చిన్నప్పటి నుంచి వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే ఎదిగాను. చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే నాకు ఇష్టం. బైక్‌ డ్రైవింగ్‌ కూడా ఆ సక్తితో నేర్చుకున్నాను. లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలన్నదే నా సిద్ధాంతం. నేటి యువతలకు నేను చెప్పే మాట కూడా అదే..

మరిన్ని వార్తలు