మెట్రో రైడ్‌..రైట్‌..రైట్‌ !

19 Apr, 2019 07:50 IST|Sakshi

2.60 లక్షలకు చేరుకున్న ప్రయాణికుల సంఖ్య

నేటి నుంచి దుర్గం చెరువు

మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్‌అండ్‌టీ షటిల్‌ సర్వీసులు

ఐటీ కారిడార్‌లో మెర్రీ గో అరౌండ్‌ బస్సులు నడుపుతున్న ఐటీ సంస్థలు..

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ వాసుల కలల మెట్రోలో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడుతోన్న సిటీజన్లు మెట్రో  పట్ల ఆకర్షితులౌతున్నారు. అయితే మెట్రో అధికారుల అంచనాలు మాత్రం తల్లకిందులయ్యాయి. ప్రస్తుతం ఎల్భీనగర్‌–మియాపూర్‌(29కి.మీ),నాగోల్‌–హైటెక్‌సిటీ (28 కి.మీ)మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నగరం రెండు చివరలను కలుపుతున్న ఈ ప్రధాన మెట్రో మార్గాల్లో నిత్యం 5 లక్షలమంది రాకపోకలు సాగిస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం రోజువారీగా సరాసరి 2.30 లక్షలు, పండగలు, వారాంతపు రోజులు, ఇతర సెలవుదినాలు, ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో గరిష్టంగా 2.60 లక్షలమంది మాత్రమే మెట్రోలో ప్రయాణిస్తుండటం గమనార్హం.

మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ వసతుల లేమి, అధిక ఛార్జీలు, స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించాల్సి రావడం తదితర కారణాల నేపథ్యంలో మెజార్టీ సిటీజన్లు మెట్రో జర్నీ పట్ల విముఖత చూపుతున్నట్లు స్పష్టమౌతోంది. నేటి నుంచి  ఎల్‌అండ్‌టీ ఉచిత షటిల్‌ సర్వీసులు  దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ జిల్లాల పరిధిలోని ఐటీ, బీపీఓ, కెపీఓ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సౌకర్యార్థం ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రత్యేకంగా శుక్రవారం నుంచి షటిల్‌ సర్వీసులు(మెర్రీ గో అరౌండ్‌)నడుపనుంది. ప్రతి 15 నిమిషాలకో బస్సు ఈ స్టేషన్‌ వద్ద అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రారంభంలో ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారన్నారు. కాగా ఇప్పటికే 12 ఐటీ కంపెనీలు ఉద్యోగుల సౌకర్యార్థం దుర్గంచెరువు, హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ల నుంచి సొంతంగా షటిల్‌ సర్వీసులు ప్రారంభించిన విషయం విదితమే.  

మెట్రోకు ఐపీఎల్‌ జోష్‌...
ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా మెట్రో సర్వీసులను అర్ధరాతి వరకు నడపడంతో సుమారు 21 వేల మంది ప్రయాణికులు మెట్రోరైళ్లలో రాకపోకలు సాగించడం విశేషం. నగరంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారీ సర్వీసు వేళలను పొడిగించడంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

సైకిళ్లు, బైక్‌లకు ఆదరణ అంతంతే..
ఇక మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులువుగా చేరుకునేందుకు వీలుగా సైకిళ్లు, ఈబైక్‌లు, ఎలక్ట్రిక్, మోటారుబైక్‌లను అద్దె ప్రాతిపదికన ఏర్పాటుచేసిన విషయం విదితమే. అయితే వీటి అద్దెలు భారంగా పరిణమించడంతో వీటికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు తమ వ్యక్తిగత వాహనాల్లోనే మెట్రో స్టేషన్లకు వచ్చేం దుకు ఆసక్తి చూపుతుండడం, లేదాఆటోలు, బస్సులు, క్యాబ్‌సర్వీసులను ఆశ్రయిస్తుండడంతో వీటికి ఆదరణ అంతగా లేకపోవడం గమనార్హం.

కాంబీ టికెట్‌ ఎప్పుడో..?
ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రోసర్వీసుల్లో ప్రయాణించేందుకు వీలుగా కాంబిటిక్కెట్‌ను ప్రవేశపెట్టే అంశంపై ఆయా విభాగాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. తమ వైపు నుంచి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారులు ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని, తమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కాంబి టికెట్‌ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశం సస్పెన్స్‌గా మారింది.

ఈ ఏడాది చివరి నాటికి జేబీఎస్,ఎంజీబీఎస్‌ రూట్లో మెట్రో..
ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబర్‌ నెలల్లో ఎంజీబీఎస్‌–జేబీఎస్‌(10 కి.మీ)రూట్లో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ మార్గంలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామన్నారు. మెట్రో రెండోదశకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ సిద్ధం చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు