రాయదుర్గం టు ఆర్‌జీఐఏ

16 Mar, 2018 08:07 IST|Sakshi

శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో పొడిగింపు 

బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయింపు  

తొలి దశకు మరో రూ.200 కోట్లు 

మొత్తంగా మెట్రోకు కేటాయింపులు రూ.600 కోట్లు 

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు మార్గాన్ని రాయదుర్గం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ) వరకు (31 కి.మీ) పొడిగించేందుకు తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించింది. మరో రూ.200 కోట్ల నిధులను మెట్రో మొదటి దశ పనులకు కేటాయించింది. ప్రస్తుతం నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌ (30 కి.మీ) మార్గంలో మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. తాజాగా ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా మార్గానికి సైతం పాత అలైన్‌మెంట్‌ ప్రకారం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌ నాటికి ఎల్బీనగర్‌–అమీర్‌పేట్, హైటెక్‌సిటీ–అమీర్‌పేట్‌ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్‌ గత నాలుగేళ్లుగా మెట్రోరైలుపై ఏర్పాటు చేస్తున్న ప్రతి సమీక్ష సమావేశంలో సూచిస్తున్నారు.

ఆయన ఆదేశాల మేరకు 31కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు బడ్జెట్‌లో రూ.400కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఈ మార్గంలో మెట్రో ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ, సాధ్యాసాధ్యాల పరిశీలన, స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలు గుర్తించడం, అవసరమైన భుములు, ఆస్తులు సేకరించడం, రహదారుల విస్తరణ, బాధితులకు పరిహారం చెల్లించడం తదితర పనులు చేపట్టనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా ఈ మార్గంలో ఒక్కో కిలోమీటర్‌ దూరానికి రూ.200 కోట్ల చొప్పున  మొత్తం రూ.6,200 కోట్లు వ్యయం కానుంది. ఈ స్థాయిలో నిధులను ప్రభుత్వం ఏదేని ఆర్థిక సంస్థ నుంచి రుణంగా సేకరిస్తుందా? లేదా మెట్రో మొదటి దశ తరహాలో పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యం లేదా హైబ్రీడ్‌ యాన్యుటీ విధానంలో చేపడుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగా ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌లో మెట్రోకు రూ.200 కోట్లు కేటాయించింది.   

తొలిదశకే ఆపసోపాలు...
ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఫలక్‌నుమా, నాగోల్‌–రాయదుర్గం మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గంలో మెట్రో మొదటి దశను చేపట్టిన విషయం విదితమే. ఈ పనులకే రూ.14,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆస్తుల సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో మెట్రో నిర్మాణ గడువు 18 నెలలు పెరిగి నిర్మాణ వ్యయం రూ.3వేల కోట్లకు చేరిందని నిర్మాణ సంస్థ గగ్గోలు పెడుతోంది. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ వరకు మెట్రో మార్గాన్ని చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారన్నది తేలాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు