ఊహూ..నై..నై!

28 Aug, 2018 08:45 IST|Sakshi

పాతబస్తీలో మెట్రో పనులకు నిర్మాణ సంస్థ విముఖత?

జఠిలంగా మారనున్న వెయ్యి ఆస్తుల సేకరణ

ప్రార్థనా మందిరాల రూట్లో రహదారి సమస్యలు

సంక్లిష్టంగా ‘రైట్‌ ఆఫ్‌ వే’

సాక్షి,సిటీబ్యూరో:  పాతనగరంలో మెట్రో రైలు పనులు కష్టతరంగానే కన్పిస్తోంది. నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా ఇటీవల అలైన్‌మెంట్‌ (మార్గం) పరిశీలన జరిగినప్పటికీ..సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా(5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, మరో 69 వరకు ప్రార్థనాస్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించడం, మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ఆఫ్‌వే స్థలాన్ని సేకరించడం వంటి పనులు కత్తిమీదసాములా మారాయి. ఈనేపథ్యంలో పాతనగరంలో మెట్రో పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రైట్‌ ఆఫ్‌ వే సమస్యల కారణంగా ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–రాయదుర్గం, జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గాల్లో 2017 జూన్‌ నాటికి పూర్తిచేయాల్సిన మెట్రో ప్రాజెక్టు దాదాపు రెండేళ్లు ఆలస్యమవుతున్న విషయం విదితమే.

సవాళ్లెన్నో...
పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు వందకోట్లకుపైగానష్టపరిహారం చెల్లించాల్సి  ఉంటుంది. ఇక ఓల్డ్‌సిటీలో ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా రూట్లో 5.5 కి.మీ మార్గంలో మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయడంతోపాటు సాలార్‌జంగ్‌మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్‌ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు రూ.1250 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్తుల సేకరణ ఆలస్యమైతే పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ఆఫ్‌ వే స్థల సమస్యల కారణంగా> ప్రాజెక్టు నిర్మాణ గడువు మరో రెండేళ్లపాటు ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.  ఇక ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనాస్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యల కారణంగానే నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగిందని..ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా  గతంలో పాతనగరంలో మెట్రో మార్గాన్ని బహదూర్‌పూరా– కాలపత్తర్‌– ఫలక్‌నుమా  మీదుగా మళ్లించాలన్న డిమాండ్లున్న విషయం విదితమే. 

ఈ రూట్లలో మెట్రో రైట్‌..రైట్‌..
సెప్టెంబరు తొలివారంలో ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రూట్లో ఇప్పటికే మెట్రో రైళ్లకు భద్రతా పరీక్షలు జరుగుతున్నాయి. నేడో రేపో కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నుంచి భద్రతా ధ్రువీకరణ జారీకానుందని మెట్రో వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఏడాది నవంబరులో అమీర్‌పేట–హైటెక్‌సిటీ రూట్లో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయని పేర్కొన్నాయి. జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గంలో వచ్చే ఏడాది మార్చినాటికి మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నాయని తెలిపాయి. కాగా ఇప్పటికే నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌(30 కి.మీ)మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటిల్లో నిత్యం సుమారు 85 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. పండగలు, సెలవు దినాల్లో రద్దీ లక్షకుపైగానే ఉంది. ఇక త్వరలో ప్రారంభంకానున్న ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ రూట్లో మెట్రో అందుబాటులోకి వస్తే ఈ రూట్లో నిత్యం అదనంగా మరో లక్షమంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు మెట్రో వర్గాలు అంచనావేస్తున్నాయి.

అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ఎల్బీనగర్‌–మియాపూర్‌(29 కి.మీ)మార్గంలో బస్సు లేదా కారు లేదా ద్విచక్రవాహనంపై ప్రయాణానికి గంటన్నర నుంచి సుమారు రెండున్నర గంటల సమయం పడుతోంది. అదే మెట్రో జర్నీ అయితే ఒక చివర నుంచి మరోచివరకి కేవలం 45–55 నిమిషాల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికులకు తమ వ్యక్తిగత వాహనాల్లో వినియోగించే ఇంధన ఖర్చుతోపాటు విలువైన సమయం ఆదా అయ్యే పరిస్థితులుండడంతో మెట్రో జర్నీకి మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు. ప్రధానంగా ఈ రూట్లో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు, ఉద్యోగులు, వాహనదారులు, వ్యాపారులు ఈ రూట్లో మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తిచూపుతారని భావిస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఆయా మెట్రో స్టేషన్ల వద్ద తమ వ్యక్తిగత వాహనాలను పార్కింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించడంతోపాటు ఆయా స్టేషన్ల వద్ద ఆర్టీసీ బస్సులు, బ్యాటరీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఆధునిక సైకిళ్లు ,బైక్‌లు అద్దెకు లభిస్తాయని..క్యాబ్‌సర్వీసులు సైతం అందుబాటులో ఉంటాయని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. ఈ రూట్లో మెట్రో సాకారమైతే ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ సైతం తగ్గుముఖం పట్టే అవకాశముందని తెలిపాయి. 

మరిన్ని వార్తలు