3.50 నిమిషాలకో మెట్రో రైలు

1 Oct, 2018 09:37 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జర్నీకి ఉదయం, సాయంత్రం వేళల్లో (పీక్‌ అవర్స్‌) గ్రేటర్‌ సిటీజన్ల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తుండడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీని 3 నిమిషాల 50 సెకన్లకు తగ్గించినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లో ప్రతీ స్టేషన్‌లో అత్యధిక రద్దీ ఉండడంతో 3.50 నిమిషాలకో రైలు నడిపినట్లు పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న 18 రైళ్లకు అదనంగా మరో మూడు రైళ్లను నడిపామన్నారు. సోమవారం నుంచి ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ఇదే ఫ్రీక్వెన్సీ ప్రకారం రైళ్లను నడపనున్నామన్నారు. కాగా ఆదివారం మెట్రో రైళ్లలో ప్రయాణించిన వారి సంఖ్య రెండు లక్షల మార్కును దాటిందని పేర్కొన్నారు.

ఇందులో 1.80 లక్షలమంది పెయిడ్‌ ప్యాసింజర్లే(టిక్కెట్‌ కొనుగోలు చేసి)నని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల ఫ్వీక్వెన్సీని క్రమంగా తగ్గించనున్నామన్నారు. కాగా సాధారణంగా రద్దీ వేళల్లో ప్రతి ఆరునిమిషాలకో రైలు..రద్దీ లేని సమయాల్లో 8 నిమిషాలకో రైలును నడుపుతున్న విషయం విదితమే. అయితే సాధారణ రోజుల్లో నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌(30 కి.మీ) మార్గంతోపాటు ఎల్బీనగర్‌–మియాపూర్‌(29 కి.మీ) రూట్లో మెట్రో జర్నీ చేస్తున్న ప్రయాణికుల సంఖ్య 1.70 లక్షలు దాటుతోందని తెలిపారు. కాగా మెట్రో జర్నీ పట్ల నగరంలో పలు సీనియర్‌ సిటిజన్స్, ట్రావెలింగ్‌ గ్రూపుల సభ్యులు, మహిళలు సంతృప్తిగా ఉన్నారని..ఎవరి సహాయం లేకుండానే మెట్రో జర్నీ చేస్తున్నట్లు పలు సంఘాలు తమకు రాతపూర్వకంగా తెలిపాయన్నారు. ఇటీవల కృష్ణకాంత్‌ పార్క్‌ ట్రావెలింగ్‌ గ్రూపు సభ్యులు మెట్రో జర్నీ చేసి సంతృప్తి వ్యక్తంచేశారని, ఈ గ్రూపులో రిటైర్డ్‌ జడ్జీ ఎ. హనుమంత్, చీఫ్‌ ఇంజినీర్‌ గణపతిరావు తదితరులున్నారన్నారు. 

మరిన్ని వార్తలు