మెట్రో మార్గాల్లో రోడ్ల విస్తరణ

28 Sep, 2014 00:54 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు మార్గాల్లో రహదారుల విస్తరణకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ రూ.10 కోట్లతో చర్యలు చేపట్టింది. ఈ నిధులతో బీటీ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. త్వరలో మెట్రో పోలిస్ సమావేశాలు జరుగనున్న దృష్ట్యా  నగరంలోని మెట్రో రైలు మార్గాల్లో అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్, వివిధ విభాగాల అధికారులు శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మెట్రో మార్గాల్లో రహదారుల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆర్‌అండ్‌బీ మార్గాల్లో బీటీ రోడ్ల విస్తరణతో పాటు, జీహెచ్‌ఎంసీ మార్గాల్లో కూడా రహదారుల విస్తరణ చేపడతారు.

మెట్రో పనుల కోసం చేపట్టిన ఫౌండేషన్ పనులు పూర్తయిన జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ మార్గాల్లో బారికేడ్లను తొలగించి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఎల్‌అండ్‌టీ సంస్థ చర్యలు తీసుకోవాలి. రోడ్ నెంబర్-36లో పౌండేషన్ పూర్తయిన చోట నాలుగైదు రోజుల్లో ముళ్ల కంచెను తొలగించాలని, పనులు పూర్తయిన చోట నుంచి నిర్మాణ సామగ్రిని సైతం తరలించాలని ఇంజినీర్లను హెచ్‌ఎంఆర్ ఎండీ ఆదేశించారు.

అలాగే, ఈ మార్గాల్లో ఉన్న చెత్త, ఇతర భవన నిర్మాణ సామగ్రిని వెంటనే తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ చీఫ్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ మార్గాల్లో ఉన్న వాటర్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వాటర్ బోర్డు అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో వాటర్ బోర్డు ఎండీ జగదీశ్వర్, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ ప్రద్యుమ్న, సైబరాబాద్ డీసీపీ అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు