ఏడాది చివరికల్లా మెట్రో పరుగులు!

22 Mar, 2017 19:46 IST|Sakshi
ఏడాది చివరికల్లా మెట్రో పరుగులు!

హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ నగర ప్రజలకు ఒక తీపివార్త. ఈ ఏడాది చివరిలోగా హైదరాబాద్ లో మెట్రోరైల్‌ పరుగులు పెట్టనుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడతగా రద్దీ ఎక్కువగా ఉండే రెండు కారిడార్లలో మొత్తం 56 కిలోమీటర్ల మేర మైట్రో రైల్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇందులో మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 29 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు 27 కిలోమీటర్ల మెట్రో మార్గం డిసెంబర్ నాటికి నగరవాసులకు అందుబాట్లోకి తేనున్నట్టు చెప్పారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్ ‌(ఎస్‌ఆర్‌డీపీ)తోపాటు నాలుగు ప్రాంతాల్లో స్కైవేలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి చెప్పారు. పురపాలనలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేసిందని, తాజా బడ్జెట్‌లోనూ రూ.5.600 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. మరో రూ.5వేల కోట్లను రుణంగా తీసుకొని మొత్తంగా 10,600 కోట్ల రూపాయలతో అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ కోసం వెచ్చించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు