మెట్రోరైల్ ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరగాలి

4 Apr, 2014 03:56 IST|Sakshi
  •      స్టే ఉన్నా ప్రైవేటు ఆస్తుల్లో పనులు
  •      కోర్టు ధిక్కారంపై త్వరలో హైకోర్టుకు
  •      కంట్రీక్లబ్ చైర్మన్ రాజీవ్ రెడ్డి
  •  హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని కంట్రీక్లబ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వై. రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనమే ధ్యేయంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) వ్యవహరిస్తోందని, ప్రైవేటు ఆస్తుల స్వాధీనంలో పారదర్శకత లేకపోవడంతో దీనిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

    గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లోనే మైట్రో రైల్వేస్టేషన్ నిర్మించాలని మెట్రో రైల్ ప్రాజెక్ట్ నివేదికలో పేర్కొన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి తమ కార్పొరేట్ ఆఫీసును స్వాధీనం చేసుకోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే మెట్రో రైలు కోసం రూ.35 కోట్ల విలువైన 1,700 చదరపు అడుగుల స్థలం ఇచ్చినప్పటికీ, 1,000 మంది సిబ్బంది పనిచేస్తున్న కార్పొరేట్ ఆఫీసును కూడా స్వాధీనం చేసుకుంటోందన్నారు.

    2006లో కార్పొరేట్ ఆఫీసు నిర్మించుకోవడానికి అభ్యంతరం లేదంటూ హెచ్‌ఎంఆర్‌ఎల్ అనుమతి ఇచ్చిన తర్వాతనే దీన్ని నిర్మించినా ఇప్పుడు నోటీసులు జారీ చేసిందని, దీనిపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా కూల్చివేస్తామంటోందని రాజిరెడ్డి ఆరోపించారు. కోర్టు ధిక్కారంపై త్వరలో హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
     

మరిన్ని వార్తలు