‘ఉపాధి’లో కదలిక..

19 Feb, 2018 14:44 IST|Sakshi
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

నేటి నుంచి గ్రామాల్లో పనులు ప్రారంభం

 మార్చి 31 వరకు గడువు

 నీటి సంరక్షణ  పనులకు ప్రాధాన్యం  

జిల్లాలో జాబ్‌కార్డులు 1,51,280
కూలీలు 3,21,283 మంది 
2017–18 ఆర్థికసంవత్సర పనుల లక్ష్యం రూ.100కోట్లు 
ఇప్పటి వరకు పూర్తి చేసిన పనుల విలువ రూ.60 కోట్లు 
మిగతా పనులు పూర్తి చేసేందుకు ఉన్న గడువు 40 రోజులు 

ఆదిలాబాద్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.వంద కోట్ల లక్ష్యంతో అధికారులు పనులు ప్రారంభించగా.. కొంతకాలంగా జిల్లాలో ఇవి నిలిచిపోయాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 40రోజులు మాత్రమే సమయం ఉండడంతో సోమవారం నుంచి ఉపాధి పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి సంస్థలోని సిబ్బందికి ఉపాధి పథకంపై శిక్షణ కూడా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 243 గ్రామ పంచాయతీల పరిధిలోని కూలీలకు ఏడాది పొడవున పనులు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్ధేశం. జిల్లాలో 1,51,280 జాబ్‌కార్డులు ఉండగా, 3,21,283 మంది కూలీలు పని చేస్తున్నారు. మార్చి 31 తర్వాత 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ ప్రణాళిక కార్యాచరణ రూపొందించేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ లోగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్న పనులను ప్రారంభించి కూలీలకు మరిన్ని పనిదినాలను కల్పించనున్నారు. అయితే ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే ఉపాధి పనులు జోరు గా సాగుతాయి. ఈ సమయంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు అంతగా ఉండవు. దీంతో కూలీలంతా ఉపాధి పనులవైపే మొగ్గుచూపుతారు.  


నీటి సంరక్షణకు పెద్దపీట.. 


ఉపాధి హామీ పథకంలో వర్షపు నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. వాన నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసి ప్రతి బొట్టును భూమిలోకి ఇంకించేందుకు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లాలో 90శాతం సాగు వర్షంపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడనున్నారు. వాన నీటి నిల్వ, సంరక్షణ కోసం విస్తృతంగా ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయానికి అనుబంధంగా రైతులకు ఉపయోగపడేలా బావుల పూడికతీత, నీటి పారుదల కాల్వల నిర్మాణం, ఫీడర్‌ చానళ్ల ఏర్పాటు, తదితర పనులకూ ప్రాధాన్యత ఇస్తామని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.  


ఈ ఏడాది రూ.66 కోట్లు ఖర్చు.. 


ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద రూ. 66కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.50 కోట్లు కూలీలకు, రూ.16 కోట్లు మెటీరియల్‌కు వెచ్చించారు. మార్చి 31లోగా మరో రూ.40 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో లక్ష పదివేల పనిదినాలు కల్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 30.98 లక్షల పనిదినాలు కల్పించారు. కొంత కాలంగా గ్రామాల్లో ఉపాధి పనులు పెండింగ్‌లో పడ్డాయి. పనులన్నీ చాలా మట్టుకు వ్యవసాయ పొలాల్లోనే చేస్తున్నారు. దీంతో పొలంలో సాగు చేసిన పంట ఉండడంతో ఇన్ని రోజులు పనులు జరగలేదు. ఇప్పుడు వచ్చేది ఎండకాలం కావడం, పొలాల్లో వేసిన పంటలను తొలగిస్తుండడంతో మళ్లీ ఉపాధి పనులు ఊపందుకోనున్నాయి. ఇందులో వర్షాకాలంలో నీటిని సంరక్షించే పనులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నారు.  


నేటి నుంచి జిల్లాలో పనులు..  
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులను ప్రారంభించాలనే ఇప్పటికే ఉన్నతాధికారుల నుం చి ఆదేశాలు అందాయి. రూ.వంద కోట్ల ప్రణాళికతో ఈ ఆర్థిక సంవత్సరం ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేస్తున్నాం. ఇందులో నీటి సంరక్షణకు సంబంధించిన పనులు అధికంగా చేపట్టనున్నాం. వాటర్‌షెడ్‌ విధానం ప్రకారమే పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించాం.   – రాథోడ్‌ రాజేశ్వర్, డీఆర్‌డీఓ ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు