మాకు మైకు ఇవ్వడం లేదు

21 Nov, 2014 02:34 IST|Sakshi
  • స్పీకర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
  • సాక్షి,  హైదరాబాద్: సభలో తమకు అవకాశం రావడం లేదని, తాము మాట్లాడుతుంటే పదే పదే అధికార పక్షానికి చెందిన మంత్రులు అడ్డుపడుతున్నారని, వారికే మైకు ఇస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు.

    ‘ఒక సభ్యుడు ఏదన్నా అంశంపై మాట్లాడుతున్నపుడు, అది పూర్తికా కుండానే మాటిమాటికి అడ్డుపడుతూ ఇబ్బంది పెడుతున్నారు’ అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తమకు మైకు ఇవ్వకుండా మంత్రులు లేచినవెంటనే వారికి మైకు ఇస్తున్నారని, తమ మైక్ కట్ చేస్తున్నారని, అందరు సభ్యులనూ సమాన దృష్టితో చూడాలని ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరినట్లు తెలిసింది.

    విపక్ష సభ్యుల చర్చను కానీ, వారి ఆవేదనను కానీ, ప్రభుత్వ తీరుపై వ్యక్తం చేసే అభిప్రాయాలు గానీ ప్రజలకు తెలియకుండా ప్రత్యక్ష ప్రసారాలను సెన్సార్ చేసి ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారని తెలిసింది. కాగా, బీజేపీ పక్ష నేత కె.లక్ష్మణ్, టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావులు జానారెడ్డి చాంబర్‌కు వచ్చి ఆయనను కలసి వెళ్లారు. ప్రతిపక్షాలన్నీ కలిసి కట్టుగా వ్యవహరించాలని వీరు సీఎల్పీ నేతను కోరినట్లు సమాచారం.
     

మరిన్ని వార్తలు