రాయితీల వెత.. పరిశ్రమల మూసివేత!

28 Sep, 2017 02:16 IST|Sakshi

తీవ్ర సంక్షోభంలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలు

ఇప్పటికే 8,618 పరిశ్రమలు ఖాయిలా

పేరుకుపోతున్న బకాయిలు 981.23 (రూ. కోట్లలో)

సేల్స్‌ ట్యాక్స్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలే 601.4 (రూ. కోట్లలో)

సాక్షి, హైదరాబాద్‌ :  సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. రాష్ట్రంలోని 69,120 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో 8,618 పరిశ్రమలు ఇప్పటికే ఖాయిలా పడ్డాయి. మరో వందల సంఖ్యలో పరిశ్రమలూ అదే దారిలో ఉన్నాయి. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి స్థాపించిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. దీంతో పెట్టుబడి రుణాలను తిరిగి చెల్లించలేక యువ పారిశ్రామికవేత్తలు చేతులెత్తేస్తున్నారు.

దీంతో ఈ రుణాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటిస్తున్న బ్యాంకులు ఈ పరిశ్రమలను వేలం వేస్తున్నాయి. కొత్తగా స్థాపించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోకుండా తొలి ఐదేళ్లు రాయితీ, పోత్సాహకాలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తోంది. రాయితీ, ప్రోత్సాహకాల కోసం ఈ పరిశ్రమలు మూడు నాలుగేళ్ల కింద పెట్టుకున్న దరఖాస్తులు ఇంకా ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కేటాయిస్తున్న రాయితీ, ప్రోత్సాహకాల నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో పెండింగ్‌ బకాయిలు ఏటికేటికీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని 5,060 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ, ప్రోత్సాహకాల బకాయిలు రూ.981.23 కోట్లకు పెరిగిపోయాయి.


ఐడియా బాగున్నా.. ఆచరణేదీ!
కొత్తగా స్థాపించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలం గాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌ అడ్వాన్స్‌మెంట్‌’ (టీ–ఐడియా) అనే పథకాన్ని 2014 నవంబర్‌ 29న ప్రకటించింది. ఈ పథకం కింద జనరల్‌ కేటగిరీకి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పితే ప్రోత్సాహకంగా రూ.20 లక్షలకు మించకుండా 15 శాతం పెట్టుబడి వ్యయాన్ని రాయితీగా ఇస్తామని పేర్కొంది.

అదే జనరల్‌ కేటగిరీ మహిళలకైతే అదనంగా రూ.10 లక్షలకు మించకుండా మరో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని వెల్లడించింది. ఈ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి 5 ఏళ్ల వరకు సేల్స్‌ ట్యాక్స్, విద్యుత్‌ బిల్లులను రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని, పెట్టుబడి రుణాలు భారం కాకుండా పావలా వడ్డీ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపింది. మొత్తం 11 రకాల ప్రయోజనాలను ప్రకటించింది.

ఈ రాయితీ, ప్రోత్సాహకాల కోసం పరిశ్రమల నుంచి వచ్చే దరఖాస్తులను రాష్ట్ర పరిశ్రమల శాఖ నేతృత్వంలోని జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు పరిశీలించి అర్హులైన వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాయి. అయితే పరిశ్రమల శాఖ సిఫారసు చేసిన మూడు నాలుగేళ్లకు గానీ ఈ ప్రయోజనాలు సదరు పరిశ్రమలకు అందట్లేదు. నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీవ్ర జాప్యమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు