300 కోట్లతో సెమీకండక్టర్ల పరిశ్రమ

18 Sep, 2018 04:10 IST|Sakshi
సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసిన మైక్రాన్‌ టెక్నాలజీ సీనియర్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ డ్రేక్, డైరెక్టర్‌ అమరేందర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్, గుత్తా

నగరంలో ఏర్పాటుకు ముందుకొచ్చిన మైక్రాన్‌ టెక్నాలజీ

వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సెమీకండక్టర్ల తయారీ కంపెనీ ‘మైక్రాన్‌ టెక్నాలజీ’హైదరాబాద్‌లో తమ ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. సింగపూర్, తైవాన్, జపాన్, చైనా, మలేసియా దేశాల్లో భారీ స్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్‌ నగరాన్ని ఎంపిక చేసుకుంది. మైక్రాన్‌ టెక్నాలజీ కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ డ్రేక్, డైరెక్టర్‌ అమరేందర్‌ సిద్ధూలతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కె.తారకరామారావుతో సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపింది. మైక్రాన్‌ టెక్నాలజీ కంపెనీ విస్తరణ కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం పట్ల కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. రూ.300 కోట్ల పెట్టుబడితో నగరంలో ఏర్పాటు చేయనున్న మైక్రాన్‌ టెక్నాలజీ పరిశ్రమతో 1,000 మంది ఇంజనీరింగ్, ఐటీ వృత్తి నిపుణులకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. మైక్రాన్‌ సంస్థ రాకతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఊతం కలగనుందని కేటీఆర్‌ తెలిపారు.  

మాదాపూర్‌లో కార్యాలయం..
మాదాపూర్‌లో సుమారు లక్షా ఎనభై వేల చదరపు అడుగుల కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి బృందం మంత్రికి తెలిపింది. కంపెనీకి అవసరమైన సిబ్బంది ఎంపిక మరియు శిక్షణకు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)తో కలసి పని చేస్తామని పేర్కొంది. పరిశోధనా అవసరాల కోసం టీ–వర్క్స్, టీ హబ్‌తో కలసి పని చేస్తామని వెల్లడించింది. మైక్రాన్, క్రూషియల్, బాలిస్టిక్‌ లాంటి అనేక గ్లోబల్‌ బ్రాండ్లను తమ కంపెనీ కలిగి ఉన్నదని, మెమొరీ ఆధారిత టెక్నాలజీ తమ ప్రత్యేకత అని కంపెనీ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా మంత్రికి వివరించింది. రానున్న రోజుల్లో తమ కంపెనీ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలను విస్తృతంగా వినియోగించేందుకు అవకాశాలున్నాయని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, పారదర్శకత, వేగం కారణంగా కంపెనీ విస్తరణ కోసం నగరాన్ని ఎంపిక చేసుకున్నామని పేర్కొంది. ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించిన తీరు పట్ల కృతజ్ఞతలు తెలిపింది. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు