ఖాళీ కడుపులతోనే  కాలేజీకి..

8 Jun, 2018 12:47 IST|Sakshi

మంచిర్యాలఅర్బన్‌ :  ‘‘ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్నభోజనం ప్రవేశపెడుతాం.. విద్యార్థులకు రుచిక రమైన భోజనం అందిస్తాం..’’ అని ప్రభుత్వం ప్రకటించినా పథకం అమలుపై ఇంతవరకు ఆదేశాలు జారీ కాలేదు. జూన్‌ ఒకటి నుంచి జూనియర్‌ కళాశాలలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఇంతవరకు కాలేజీల్లో మధ్యాహ్నభోజన పథకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్నభోజన పథకం ఈ విద్యాసంవత్సరం నుంచి అమలువుతుందో.. లేదో అనే అనుమానాలు విద్యార్థులు, అధ్యాపకుల్లో  వ్యక్తమవుతున్నాయి.

గత నెల 21 నుంచి నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ప్రయివేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మూడేళ్లుగా మధ్యాహ్నభోజన ప«థకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తూ వస్తోంది. అలాగే ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు అందించిందే తప్ప మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేయడంలో విఫలమైంది. దీంతో విద్యార్థులు ఖాళీ కడుపులతోనే కళాశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దూరప్రాంత విద్యార్థులకు ఇక్కట్లే..
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆరాటపడుతున్నా ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదు. జిల్లాలో మంచిర్యాల, మందమర్రి, కాసిపేట్, చెన్నూర్, బెల్లంపల్లి (బాలురు), బెల్లంపల్లి (బాలికలు), జైపూర్, జన్నారం, దండేపల్లి, లక్సెటిపేట్‌లలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీతో పాటు వృత్తివిద్యా కోర్సులైన ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఎస్సీ కోర్సులు నిర్వహిస్తున్నారు. 2016–17 విద్యా  సంవత్సరం  1800 మంది విద్యార్థులు చదువుకోగా.. 2017–18 విద్యాసంవత్సరంలో 2800 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. జిల్లాలో 18 మండలాలకు గాను తొమ్మిది మండలాల్లోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేశారు. భీమిని, తాండూర్, నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన హాజీపూర్, కన్నెపల్లి, నస్పూర్, భీమారం మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

ప్రస్తుతం ఆయా మండలాల విద్యార్థులు సమీప మండల కేంద్రాల్లోని కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కళాశాలకు ఉదయం 9.30 గంటలకు వెళ్లాలంటే రెండు గంటలు ముందుగానే అంటే ఉదయం 7గంటలకే విద్యార్థులు ఇళ్లనుంచి బయల్దేరాల్సి వస్తోంది. పేద విద్యార్థుల ఇళ్లలో ఉదయం వంట కాకపోవడంతో అల్పాహారం తీసుకోకుండానే కళాశాలలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో అలమటించాల్సిందే. ఆర్ధాకలితో ఉన్న విద్యార్థులకు అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఈసారి మధ్యాహ్నభోజనం అమలు చేస్తామని వెల్లండించినప్పటికీ ఖచ్చితమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

దాతలపైనే భారం..
విద్యార్థుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని గతేడాది నుంచి కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో దాతలు ముందకు వచ్చి మధ్యాహ్నభోజనం అమలు చేశారు. లక్సెట్టిపేట్, దండేపల్లి, మంచిర్యాల ప్రభుత్వ కళాశాలల్లో మంచిర్యాలకు చెందిన ఛత్రపతి సాహు మహరాజ్‌ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఆరె శ్రీనివాస్‌ నేతృత్వంలో మధ్యాహ్నభోజనం అందించారు. పరీక్షలకు నాలుగునెలల ముందు నుంచి రోజుకు 926 మందికి భోజనం వడ్డించడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివెరిసింది. అలాగే చెన్నూర్, జైపూర్, మందమర్రి జూనియర్‌ కాలేజీల్లో ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు విద్యార్థుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేశారు. ఈసారి ప్రభుత్వం అమలు చేయకుంటే మళ్లీ స్వచ్ఛంద సంస్థలే ఆధారం కానున్నాయి.

ఉత్తర్వులు రాలేదు..
ఈ విద్యాసంవత్సరంలో మధ్యాహ్నభోజన పథకం అమలుపై అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో పథకాన్ని అమలు చేస్తే విద్యార్థుల హాజరు శాతం పెరిగి, మెరుగైన ఫలితాలు సాధించేందకు అవకాశం ఉంటుంది. అయితే కళాశాలల ప్రారంభం తర్వాత దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. – బీనారాణి, డీఐఈవో

కళాశాలలు బలోపేతం..
మ«ధ్యాహ్నభోజనం పథకం అమలుతో ప్రభుత్వ కళాశాలలు బలోపేతం అవుతాయి. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, మధ్యాహ్నం సమయంలో లంచ్‌బాక్స్‌ తీసుకురాకపోవడంతో విద్యార్థులు నీరసంగా ఉంటారు. దీంతో మధ్యాహ్నం సమయంలోనే కొంత మంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోతున్నారు. తద్వారా హాజరుశాతం తగ్గుతోంది.  – లక్ష్మన్‌రావు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల లెక్చరర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఎంతో ప్రయోజనం..
కళాశాలల్లో మధ్యాహ్నభోజనం ప్రవేశపెడుతున్నారని ప్రకటించడంతో సంతోషించాను. తీరా చూస్తే పథకం ఊసేలేదు. మధ్యాహ్నభోజనంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గత విద్యాసంవత్సరంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పరీక్షల సమయంలో మధ్యాహ్నభోజనం పెట్టడంతో మాలాంటి ఎంతో మందికి మేలు జరిగింది. – ప్రవీణ్, ఇంటర్‌ ఉత్తీర్ణత విద్యార్థి 

మరిన్ని వార్తలు