మధ్యాహ్న భోజన పథకం అమలేది..!

2 Aug, 2019 11:36 IST|Sakshi

కళాశాలల్లో జాడలేని మధ్యాహ్న భోజన పథకం 

ఆకలితో అలమటిస్తున్న దూర ప్రాంత విద్యార్థులు 

కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా పట్టించుకోని పరిస్థితి 

పథకం అమలు చేయాలని విద్యార్థి సంఘాల ఆందోళన 

సాక్షి, ఖమ్మం: జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి మూడేళ్లయినా ముందుకెళ్లడం లేదు. కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా భోజనం జాడలు కనిపిం చడం లేదు. అసలు ప్రభుత్వం భోజన పథకం అమలు చేస్తుందా.. లేదా అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. దీనిపై విధాన నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోగా.. విద్యార్థి సంఘాలు మాత్రం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంఘాలు ఆందోళనకు దిగాయి.  జిల్లాలో 19 జూనియర్‌ కళాశాలలు ఉండగా.. వీటిలో మొదటి సంవత్సరం 3,267 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

ద్వితీయ సంవత్సరంలో 3,128 మంది ఉన్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాలల్లో విద్యార్థుల చేరిక కూడా బాగానే ఉంది. అయితే ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మధ్యాహ్న భోజనం లేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బాక్స్‌లు తెచ్చుకుంటున్నా.. చాలా మంది విద్యార్థులు ఉదయమే కళాశాలకు వస్తుండడంతో భోజనం తెచ్చుకోవడం వారికి వీలు కావడం లేదు. అయితే ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రకటిస్తూ వస్తోందని, తమకు అమలు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు.

కళాశాలల్లో చేరిన విద్యార్థులు.. 
తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపించడం ఇష్టంలేని తల్లిదండ్రులు దగ్గర్లో ఉన్న జూనియర్‌ కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు ఎక్కువ మంది స్థానికంగా ఉండే జూనియర్‌ కళాశాలల్లో చేరుతున్నారు. అయితే ఉదయం వెళ్లిన వారు సాయంత్రమే మళ్లీ ఇంటికి రావడం కుదురుతోంది. అయితే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు జరుగుతుందనే ప్రచారంతో చాలా మంది విద్యార్థులు కళాశాలల్లో చేరారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం గురించి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకపోవడంతో విద్యార్థులు సాయంత్రం వరకు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే భోజనం సిద్ధం కాదు.. దీంతో కొందరు విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయంలో ఇంటి వద్దే భోజనం చేసి బయలుదేరుతారు. ఇక సాయంత్రం వరకు వారికి తినేందుకు ఏమీ అందుబాటులో ఉండడం లేదు. మధ్యాహ్నం సమయంలో కేవలం మంచినీటితోనే కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ఆకలితోనే పాఠాలు వినాల్సి వస్తోంది. కొందరు విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో వారు ఆకలితో, ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
 
ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే.. 
కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచే భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయమే భోజనం సిద్ధం కాని పరిస్థితి ఉండడవంతో విద్యార్థులు హడావుడి చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు కళాశాల సమయానికంటే ముందే లేచి తమ పిల్లలకు భోజనం సిద్ధం చేయాల్సి వస్తోంది. దూర ప్రాంత విద్యార్థులు కళాశాలకు చేరుకోవాలంటే ముందుగానే బయలుదేరాలి. అలాగే సాయంత్రం ఇంటికి చేరే వరకు సమయం ఎక్కువ పడుతోంది. బస్సులో ప్రయాణించాల్సి రావడంతో వారు తప్పనిసరిగా భోజనం తీసుకెళ్లాల్సిందే. భోజనం లేకపోతే త్వరగా నీరసం వస్తుందని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.

విద్యార్థి సంఘాల ఆందోళన.. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మధ్యాహ్న భోజనం అమలు చేస్తారనే ఉద్దేశంతో విద్యార్థులు జూనియర్‌ కళాశాలల్లో చేరారు. అయితే పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పలు కళాశాలల ఎదుట ఆందోళనలు కూడా చేశారు.  
 ‘భోజన’ పథకాన్ని అమలు చేయాలి.. 
నాటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తామని మూడేళ్ల క్రితం ప్రకటించారు. ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ విషయంపై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి సైతం స్పందించడం లేదు. ప్రభుత్వం, అధికారులు సత్వరమే స్పందించి కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి.  
– ఆజాద్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి 

మరిన్ని వార్తలు